
న్యూఢిల్లీ: భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రత్యేక గడియారాలను ధరించనున్నారు. శుభాన్షుతో సహా నలుగురు వ్యోమగాములు వీటిని ధరిస్తారని మిషన్ నిర్వాహక సంస్థ ఆక్సియమ్ స్పేస్ ధ్రువీకరించింది. ఒమేగా గడియారాలను మరోసారి రోదసీ యాత్రకు తీసుకెళ్లడానికి ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఈ గడియారాలను స్విట్జర్లాండ్‌కు చెందిన ఒమేగా సంస్థ తయారు చేసింది.
ఈ ప్రత్యేక గడియారాలు మానవ అంతరిక్ష ప్రయాణంలో తొలి రోజుల నుంచే భాగమయ్యాయి. నాసాతో ఒమేగా అనుబంధం 1960ల్లో ప్రారంభమైంది. మొదటిసారి స్పీడ్‌మాస్టర్‌ను అక్టోబర్ 3, 1962న మెర్క్యురీ సిగ్మా 7 మిషన్‌లో వ్యోమగామి వాలీ షిర్రా ధరించి వెళ్లారు. అయితే ఇది అనధికారికంగా ఉపయోగించారు. అప్పటికి నాసా ఇంకా ఆమోదించలేదు.
1965 మార్చి 1న మానవసహిత మిషన్లలో ఉపయోగించడానికి నాసా ఒమేగా స్పీడ్‌మాస్టర్‌ను అధికారికంగా ధ్రువీకరించింది. దీనిని అపోలో మిషన్లలో విస్తృతంగా ఉపయోగించారు. అపోలో 11తో మొదటిసారి చంద్రునిపైనా కాలుపెట్టింది. నేటికీ వ్యోమగాములతో అంతరిక్షానికి వెళుతోంది. ఈ గడియారాలను గురుత్వాకర్షణ లేని పరిస్థితులు, తీవ్రమైన ఉష్ణోగ్రతల హెచ్చుతగ్గులు, అధిక పీడనం వరకు అంతరిక్షంలోని అన్ని రకాల పరిస్థితులను తట్టుకునేలా రూపొందించారు. శుక్లాతో సహా ప్రతి వ్యోమగామికి రెండు ఒమేగా స్పీడ్‌మాస్టర్ గడియారాలు అందుతాయి.