కేసులు పెరిగిపోతున్నాయి బాబోయ్‌.. | India Records Spike of 47,262 New COVID-19 Cases | Sakshi
Sakshi News home page

కేసులు పెరిగిపోతున్నాయి బాబోయ్‌..

Mar 25 2021 2:03 AM | Updated on Mar 25 2021 11:34 AM

India Records Spike of 47,262 New COVID-19 Cases - Sakshi

కోల్‌కతాలో కోవిడ్‌ అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణకు బ్రేకులు పడటం లేదు. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్‌ కేసులూ ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో 47,262 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. ఈ ఏడాదిలో ఒక రోజు వ్యవధిలో నమోదైన అత్యధిక కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. తాజా కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,17,34,058కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 275 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,60,441కు చేరుకుందని తెలిపింది. దాదాపు 83 రోజుల తర్వాత మళ్లీ ఈ స్థాయిలో ఒకేరోజు 270కి పైగా మరణాలు సంభవించాయి. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 1,12,05,160కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 95.49 శాతానికి చేరింది.

యాక్టివ్‌ కేసుల సంఖ్య 3,68,457గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 3.14   శాతం ఉన్నాయి. మరణాల శాతం 1.37గా ఉంది. దేశంలో సంభవిస్తున్న కరోనా మరణాల్లో 88 శాతం మంది 45 ఏళ్ల వయసు దాటినవారేనని కేంద్రం స్పష్టం చేసింది. వారిని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఈ వయసు వారిలో మరణాల శాతం 2.85గా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషన్‌ చెప్పారు. అందువల్లే 45 ఏళ్లు దాటిన వారందరికీ ఏప్రిల్‌ 1 నుంచి వ్యాక్సిన్‌ ఇస్తున్నట్లు తెలిపారు. గత 24 గంటల్లో బయట పడిన కేసుల్లో 77.44 శాతం కేవలం అయిదు రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. వాటిలో మహారాష్ట్ర, పంజాబ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, గుజరాత్‌లు ఉన్నాయి. ఆరు రాష్ట్రాల్లో కలిపి 81.65 శాతం కేసులు నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా మహారాష్ట్రలో 31,855 కేసులు బయటపడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement