ఒక్క రోజే 90 వేల కేసులు

India record of 90632 corona virus cases in 24 hours - Sakshi

దేశంలో 41 లక్షలు దాటిన కరోనా కేసులు

31లక్షలు దాటిన కోలుకున్న వారు

న్యూఢిల్లీ: దేశంలో శనివారం కరోనా కేసులు భారీగా బయటపడ్డాయి. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 90,632 కేసులు నిర్ధారణయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,13,811కు చేరుకుంది. నాలుగు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 73,642 మంది కోలుకోగా.. 1,065 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 70,626కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 31,80,865కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,62,320గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.96 శాతం ఉన్నాయి. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది. శనివారానికి ఇది 77.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు ప్రస్తుతం 1.72 శాతానికి పడిపోయిందని తెలిపింది.

ఇంజనీర్డ్‌ సర్ఫేస్‌ రూపకల్పన
ఐఐటీ గువాహటికి చెందిన నిపుణులు కరోనాను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి ఇంజనీర్డ్‌ సర్ఫేస్‌ను తయారు చేశారు. కరోనా వైరస్‌ రెండు భాగాలుగా ఉంటుందని అందులో లోపలి పొర న్యూక్లియిక్‌ ఆసిడ్‌ ఉండగా, బయటి వైపు గ్లైకోప్రొటీన్‌ అనే కొమ్ములు ఉంటాయని చెప్పారు. ఈ సర్ఫేస్‌ మీద కరోనా వైరస్‌ పడితే వెంటనే గుర్తించవచ్చని చెప్పారు. ఇందులో పలు సెల్ఫ్‌ అసెంబుల్డ్‌ మోనో లేయర్స్‌ (ఎస్‌ఏఎంస్‌) ఉన్నాయని పేర్కొన్నారు. కరోనా వంటి ప్రొటీన్లు దానిపై పడినప్పుడు అవి పీల్చుకుంటాయని చెప్పారు. ప్రత్యేకించి ఈ సర్ఫేస్‌ను పీపీఈలకు తగిలించినప్పుడు కరోనాను గుర్తించడమేగాక, నాశనం చేయవచ్చని వెల్లడించారు. ఈ విషయాలన్నీ పలు జర్నల్స్‌లో సైతం ప్రచురితమైనట్లు చెప్పారు.  

అర్జున్‌ కపూర్‌కు కోవిడ్‌
బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ (35) కోవిడ్‌ బారినపడ్డారు ఆదివారం ఆయనే స్వయంగా ఈ విషయం వెల్లడించారు. అయితే తనకు లక్షణాలేమీ లేవని, ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని, హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నానని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ బాలీవుడ్‌ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top