
రెమిటెన్స్‌ల్లో ప్రపంచంలో.. భారత్ నం.1
2024–25లో రూ.11.6 లక్షల కోట్ల వరద
దేశంలో ఇప్పటివరకు ఈ మొత్తమే రికార్డు
రాష్ట్రాల్లో టాప్–4లో తెలంగాణ, 6లో ఆంధ్రప్రదేశ్
రూ.11.6 లక్షల కోట్లు.. ప్రపంచంలోని వివిధ దేశాల్లోని భారతీయులు 2024–25లో మనదేశానికి పంపిన డబ్బులివి. ఇలా అందుకున్న మొత్తం పరంగా ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ఔరా అనిపించింది. ఈ స్థాయిలో నగదు వెల్లువెత్తడం ఇదే తొలిసారి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మించి రెమిటెన్స్‌లు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. దేశాల పరంగా చూస్తే అత్యధికంగా యూఎస్ నుంచి రెమిటెన్స్‌ల వరద పారుతోంది. -సాక్షి, స్పెషల్ డెస్క్
విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ మనదేశంలోని తమ వాళ్లకు డబ్బులు పంపే భారతీయులు కోటిన్నరకు పైగానే ఉంటారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచ దేశాలలోని స్వదేశీయుల నుంచి భారత్‌కు బట్వాడా అయిన స్థూల నగదు విలువ 135.46 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.11.6 లక్షల కోట్లకుపైనే) చేరుకుందని భారతీయ రిజర్వు బ్యాంకు విడుదల చేసిన తాజా గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు వచ్చిన మొత్తాల్లో ఇదే అత్యధికమని, మునుపటి ఆర్థిక సంవత్సరం కంటే 14 శాతం ఎక్కువని కూడా ఆర్బీఐ పేర్కొంది. ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం.. 2023–24లో ఇలా అత్యధిక మొత్తం అందుకున్న దేశం మనదే.
ఆ మూడు దేశాల నుంచే...
నిజానికి భారత్ ఒక దశాబ్దానికి పైగానే దేశాలన్నిటి కంటే అధిక మొత్తంలో నగదు చెల్లింపులను అందుకుంటోంది. గత ఎనిమిదేళ్లలో భారత్‌కు ఈ నగదు ప్రవాహం రెట్టింపు అయింది. 2016–17లో మన దేశానికి అందిన నగదు మొత్తం 61 బిలియన్ డాలర్లు మాత్రమే. కాగా, గత ఆర్థిక సంవత్సరంలో రెట్టింపునకుపైగా వచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా మారుతున్న పరిణామాలు, యుద్ధ వాతావరణం, ముడి చమురు ధరలు బలహీనంగా ఉన్నప్పటికీ ఎన్నారైలు స్వదేశానికి పంపుతున్న నగదు మొత్తాలు మాత్రం ఏటా పెరుగుతూ ఉండటం గమనార్హం.
అమెరికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యూకే.. ఏటా భారత్‌కు బట్వాడా అవుతున్న నగదు మొత్తంలో ఈ మూడు దేశాల నుంచే దాదాపు 60 శాతం మనదేశానికి వస్తోంది. ఇదే సమయంలో జి.సి.సి. (గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాల నుంచి వస్తున్న నగదు స్వల్పంగా తగ్గుతోంది. (ఆధారం : ఆర్బీఐ)
ప్రధానంగా ఇంటి ఖర్చులకే
ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం కూడా ఇండియానే ఎక్కువ నగదును పొందుతున్న దేశంగా ఉంది. 2024లో మెక్సికో 68 బిలియన్ డాలర్ల అంచనా మొత్తంతో రెండవ స్థానంలో, చైనా 48 బిలియన్లతో మూడవ స్థానంలో ఉంది. భారత్‌కు ప్రధానంగా వివిధ దేశాలకు వెళ్లిన స్వదేశీయుల నుంచే నగదు అందుతోంది. ఇలా దేశాలకు బట్వాడా అయే నగదు మొత్తాలను అంతర్జాతీయ ద్రవ్య నిధి రెండు రకాలుగా వర్గీకరించింది.
ఒకటి ప్రాథమిక ఆదాయ ఖాతా కింద ఉద్యోగులు తమ సంపాదన నుంచి ఇళ్లకు పంపిస్తున్నవి, రెండు.. ద్వితీయ ఆదాయ ఖాతా కింద వ్యక్తిగత మొత్తాల బదిలీలు (ఉదా: విరాళాలు, నగదు సహాయాలు వగైరా..) భారత్ విషయంలో – నగదు బట్వాడాలు అన్నవి ప్రధానంగా విదేశాలలో నివసిస్తున్న భారతీయ ఉద్యోగులు, కార్మికుల నుంచి కుటుంబ నిర్వహణ కోసం అందుతున్నవేనని ఆర్బీఐ 2025 మార్చిలో తన నెలవారీ బులెటి¯Œ లో పేర్కొంది.
పెట్టుబడుల కంటే ఎక్కువ!
నగదు బదిలీ ఖర్చులు తక్కువగా ఉండే దేశాలలో భారత్ నేటికీ ఒకటిగా కొనసాగుతోందని ఆర్బీఐ డేటా వెల్లడించింది. ‘భారత్‌కు అందుతున్న నగదు మొత్తం భారత్‌కు వస్తున్న స్థూల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల కంటే ఎక్కువగా ఉంది. దాంతో బయటి నుంచి వచ్చే నగదు భారత్‌కు ఒక స్థిరమైన వనరు అయింది’ అని ఆర్బీఐ సిబ్బంది సర్వే నివేదిక పేర్కొంది. అంతేకాకుండా, ఆ మొత్తాలు భారతదేశ వాణిజ్య లోటు నిధుల భర్తీలో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో స్థూల నగదు ప్రవాహం దేశంలోని 287 బిలియన్ల వాణిజ్య లోటులో దాదాపు సగంగా (47 శాతం) ఉంది.