మహిళల సారథ్యంలో అభివృద్ధి వైపు భారత్‌

India Moved From Women Development To Women-Led Development - Sakshi

ఎస్‌హెచ్‌జీలను యూనికార్న్‌ల స్థాయికి తీసుకెళ్తాం: ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: భారతదేశం గత 9 ఏళ్లలో మహిళాభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలో అభివృద్ధి వైపు పయనించిందని ప్రధాని మోదీ అన్నారు. మహిళాస్వయం సహాయక బృందా(ఎస్‌హెచ్‌జీ)లను యూనికార్న్‌ల స్థాయికి తీసుకెళతామని చెప్పారు. మహిళా సాధికారతపై శుక్రవారం జరిగిన పోస్ట్‌ బడ్జెట్‌ వెబినార్‌లో ప్రధాని ప్రసంగించారు. ‘ఇంజనీరింగ్, సైన్స్, టెక్నాలజీ, మేథ్స్‌ రంగాల్లో మహిళల భాగస్వామ్యం ప్రస్తుతం 43%కి చేరుకుంది. స్వయం సహాయ సంఘాలను కూడా ఈ ఏడాది యూనికార్న్‌లుగా మార్చాలని బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఇందుకోసం ఎస్‌హెచ్‌జీలకు మద్దతుగా నిలుస్తాం. గత 9 ఏళ్లలో ఎస్‌హెచ్‌జీల్లో 7 కోట్ల మంది మహిళలు చేరారు. ఎస్‌హెచ్‌జీల ద్వారా అందించిన రుణాలు రూ.6.25 లక్షల కోట్లకు చేరాయి. వ్యవసాయేతర ప్రతి ఐదు వ్యాపారాల్లో ఒకటి మహిళే నడుపుతున్నారు’అని ఆయన చెప్పారు. స్టాక్‌ మార్కెట్‌లో నమోదు కాకుండానే 1 బిలియన్‌ డాలర్ల స్థాయికి ఎదిగిన కంపెనీలనే యూనికార్న్‌లంటారు. ‘ముద్రా రుణ గ్రహీతల్లో 70% మంది మహిళలే. వీరు తమ కుటుంబ సంపాదనను పెంచడంతోపాటు దేశానికి నూతన ఆర్థిక మార్గాలను తెరుస్తున్నారు. మహిళల పట్ల గౌరవం, సమానత్వ భావన స్థాయిలను పెంచడం ద్వారా మాత్రమే దేశం ముందుకు సాగుతుంది’అని ప్రధాని చెప్పారు.   

విపత్తులొస్తే నష్టాన్ని తగ్గించుకోగలగాలి  
ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహకారం తీసుకోవాలని ప్రధానమంత్రి అన్నారు. విపత్తు ముంచుకొచ్చాక స్పందించడం కంటే, ముందుగానే ఫ్యూచర్‌ టెక్నాలజీస్‌ని వినియోగించుకొని జరిగే నష్టాన్ని తగ్గించుకోవాలన్నారు. నేషనల్‌ ప్లాట్‌ఫారమ్‌ ఫర్‌ డిజాస్టర్‌ రిస్క్‌ రిడక్షన్‌ (ఎన్‌పీడీఆర్‌ఆర్‌) మూడో సదస్సును శుక్రవారం ప్రారంభించి ప్రధాని మాట్లాడారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top