Super Mom Tigress: ‘సూపర్‌ మామ్‌’ కాలర్‌వాలీ ఇక లేదు.. సీఎం చౌహాన్‌ విచారం

India mourns death of Super Mom tigress who gave birth to 29 cubs - Sakshi

29 పిల్లలకు జన్మనిచ్చిన ‘కాలర్‌వాలీ’

17 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత

సియోని (మధ్యప్రదేశ్‌): ఆవు, గేదె లాంటివి తమ జీవితకాలంలో అధికసంఖ్యలో పిల్లలను కంటే దాని యజమానుల ఆనందమే వేరు. సంతాన లక్ష్మి, అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. అలాంటిది ఏకంగా 29 పిల్లల్ని కంటే. ఈ పులి అదే చేసింది. 29 పులి పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్‌లోని పెంచ్‌ టైగర్‌ రిజర్వు (పీటీఆర్‌)కు గర్వకారణంగా నిలిచిన ఈ విఖ్యాత పులి పేరు ‘కాలర్‌వాలీ’.

ఈ సూపర్‌ మామ్‌ 17 ఏళ్ల వయసులో శనివారం కన్నుమూసింది. పులి సాధారణ జీవితకాలం 12 ఏళ్లు. కాలర్‌వాలీ దానికి మించి ఐదేళ్లు బతికి వృద్ధా్దప్య సమస్యలతో మరణించింది. చివరిసారిగా ఈనెల 14న సందర్శకులకు కనిపించిన కాలర్‌వాలీ చాలా బలహీనంగా ఉందని, వారం రోజులుగా దాని ఆరోగ్యాన్ని పరిశీలిస్తున్నామని పెంచ్‌ టైగర్‌ రిజర్వ్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  

ఒకే కాన్పులో ఐదు పిల్లలు...
కాలర్‌వాలీ మొత్తం ఎనిమిది కాన్పుల్లో 29 పులి పిల్లలకు జన్మనివ్వగా... ఇందులో 25 బతికాయి. 2008లో మొదటిసారిగా తల్లి అయిన కాలర్‌వాలీ మూడు పిల్లలను కన్నది. దురదృష్టవశాత్తు ఇందులో ఒక్కటీ బతకలేదు. 2010 అక్టోబరులో ఒకే కాన్పులో ఐదు పిల్లలకు (నాలుగు మగ కూనలు, ఒక ఆడపులి పిల్ల) జన్మనిచ్చింది. చివరిసారిగా 2018 డిసెంబరులో నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఈ మహాతల్లి కడుపున పుట్టిన పులి పిల్లల సంఖ్య 29కి చేరింది.

అడవిలో పులుల సంఖ్య గణనకు, వాటి ప్రవర్తనను గమనించేందుకు, జాడను కనిపెట్టేందుకు రేడియో సిగ్నల్స్‌ను పంపే పట్టీలకు పులుల మెడకు కడతారు. 2008లో కట్టిన పట్టీ పనిచేయకపోవడంతో 2010 మరో పట్టీని ‘టి15’గా పిలిచే ఈ పులికి కట్టారు. దాంతో దీనికి కాలర్‌వాలీ అనే పేరొచ్చింది. మధ్యప్రదేశ్‌లో 526 పులులున్నాయి. 2018లో అత్యధిక పులులున్న రాష్ట్రంగా అవతరించిన మధ్యప్రదేశ్‌ భారతదేశపు ‘టైగర్‌ స్టేట్‌’గా గుర్తింపు పొందింది. కాలర్‌వాలీ పెంచ్‌ రిజర్వు పెద్ద ఆకర్షణగా ఉండేది. ‘సూపర్‌ మామ్‌ కాలర్‌వాలీకి నివాళులు. 29 పిల్లలతో మధ్యప్రదేశ్‌కు గర్వకారణంగా నిలిచింది. అని రాష్ట్ర సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ఓ ట్వీట్‌లో విచారం వ్యక్తం చేశారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top