‘వర్చువల్ స్కూల్‌’పై కేంద్రం, కేజ్రీవాల్‌ వాదులాట

India First Virtual School Launched by Centre, Not by Delhi Govt: NIOS - Sakshi

న్యూఢిల్లీ: ‘వర్చువల్ స్కూల్‌’పై కేంద్రం, కేజ్రీవాల్‌ సర్కారు వాదనలకు దిగాయి. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్‌ను బుధవారం ప్రారంభించినట్టు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌కు అనుబంధంగా దీన్ని ప్రారంభించామని ఆయన చెప్పుకొచ్చారు. 9వ తరగతికి ప్రవేశ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఢిల్లీ మోడల్ వర్చువల్ స్కూల్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు లైవ్‌ క్లాసులకు హాజరుకావొచ్చని.. రికార్డు చేసిన పాఠాలు, స్టడీ మెటీరియల్‌ కూడా వారికి అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. జేఈఈ, నీట్ వంటి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకూ సాయం అందిస్తామని చెప్పారు. 

గతేడాదే ప్రారంభించాం
కేజ్రీవాల్‌ ప్రకటనపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌(ఎన్‌ఐఓఎస్‌) స్పందించింది. దేశంలో మొట్ట మొదటి వర్చువల్ స్కూల్‌ను గతేడాది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని ఎన్‌ఐఓఎస్‌ తెలిపింది. ‘మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేతుల మీదుగా 2021, ఆగస్ట్ 14న వర్చువల్ స్కూల్‌ని ఎన్‌ఐఓఎస్‌ ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వం తాజాగా దీన్ని ప్రారంభించిందని చదివి నేను ఆశ్చర్యపోయాను. దేశంలోనే తొలిసారిగా జాతీయ స్థాయిలో దీన్ని మేము ప్రారంభించాం. ప్రస్తుతం 3వ సెషన్‌ జరుగుతోంద’ని ఎన్‌ఐఓఎస్‌ చైర్‌పర్సన్ సరోజ్ శర్మ తెలిపారు. వర్చువల్ స్కూల్‌ నిర్వహణలో ఢిల్లీ ప్రభుత్వానికి తమ సహాయం కావాలంటే తప్పకుండా చేస్తామన్నారు. 

అకడమిక్ సపోర్టు అందిస్తున్నాం
తమకు అనుబంధంగా ఉన్న 7000 అధ్యయన కేంద్రాలు ప్రస్తుతం విద్యార్థులకు అకడమిక్ సపోర్టును అందిస్తున్నాయని ఎన్‌ఐఓఎస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 1500 అధ్యయన కేంద్రాల ద్వారా నైపుణ్య ఆధారిత వృత్తి విద్యా కోర్సుల్లోనూ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ అధ్యయన కేంద్రాల ద్వారా లైవ్ ఇంటరాక్టివ్ తరగతులు నిర్వహిస్తున్నామని, ఇప్పటివరకు 2.18 లక్షల అసైన్‌మెంట్‌లను అభ్యాసకులు అప్‌లోడ్ చేశారని తెలిపింది. ఇటీవల పూర్తయిన అకడమిక్ సెషన్‌లో 4.46 లక్షల అసైన్‌మెంట్‌లు, ట్యూటర్ మార్క్ అసైన్‌మెంట్(టీఎంఏ) అప్‌లోడ్‌ అయ్యాయి. సబ్జెక్ట్ నిపుణులచే మూల్యాంకనం చేసిన టీఎంఏ మార్కులు అభ్యాసకులకు వారి డాష్‌బోర్డ్‌లో కనిపిస్తాయని ఎన్‌ఐఓఎస్‌ వివరించింది. (క్లిక్‌: సిసోడియా అరెస్ట్‌ అయితే మరీ మంచిదన్న కేజ్రీవాల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top