జనగణన మరింత ఆలస్యం!

India Census 2021 even more delayed - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా కరోనా ఉధృతి పెరుగుతున్నందున, దశాబ్దానికి ఒకమారు జరిపే సార్వత్రిక జనగణన కార్యక్రమం ఇప్పట్లో జరగకపోవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. నిజానికి ఈ గణన 2020–21లో జరగాల్సిఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ పరిస్థితులు పూర్తిగా శాంతించనందున ఇప్పట్లో గణన ఉండకపోవచ్చంటున్నారు. జిల్లాల సరిహద్దులను, సివిల్‌ మరియు పోలీసు యూనిట్ల హద్దులను 2022 జూన్‌ వరకు మార్చవద్దని కేంద్రం ఇటీవలే రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు సెన్సస్‌ రిజిస్టార్‌ జనరల్‌ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. జనగణనకు మూడు నెలల ముందు ఇలా హద్దుల మార్పుపై నిషేధం విధిస్తారు.

ఇప్పటికే జూన్‌ వరకు నిషేధం ఉన్నందున ఇది తొలగిన అనంతరమే జనగణనకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అంటే జూన్‌లో నిషేధం తొలగిన అనంతరం జనగణన నోటిఫికేషన్‌ జారీ చేయదలిస్తే మరోమారు సరిహద్దుల మార్పును నిలిపివేస్తూ ఆదేశాలిస్తారు. తర్వాత 3నెలలకు గణన ఆరంభమవుతుంది. అంటే ఎంత కాదన్నా, వచ్చే అక్టోబర్‌ వరకు జనగణన జరిగే అవకాశం లేదని నిపుణుల విశ్లేషణ. జిల్లాల, ఇతర యూనిట్ల హద్దుల మార్పుపై నిషేధాన్ని కేంద్రం తొలుత 2020 జనవరి 1 నుంచి మార్చి 31 వరకు విధించింది. ప్రస్తుత నిషేధం ఈ జూన్‌ 30 వరకు ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top