
హిండన్: తక్కువ రోజుల్లోనే సానుకూల ఫలి తాలను రాబట్టుకునేందుకు వైమానిక శక్తిని ఎంత ప్రభావవంతంగా ఉపయోగించుకోవచ్చ నేది ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి నిరూపించి చూపామని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ చెప్పారు. శత్రువు లక్ష్యాలపై గురి తప్పని దాడులు జరిపిన వైమానిక దళం దేశ ప్రజల గుండెల్లో తన స్థానాన్ని పదిలం చేసుకుందన్నారు. హిండన్ వైమానిక స్థావరంలో బుధవారం జరిగిన 93వ వైమానిక దళ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. కొత్త వ్యవస్థలు, ఆయుధాలు, పరికరాలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో వైమానిక దళం విజయవంతమైందన్నారు.
రక్షణ, భద్రతలకు సంబంధించిన అంశాల్లో ఎయిర్ వారియర్లలో జవాబుదారీతనం పెరుగుతున్నందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రమాదాలు తగ్గుముఖం పట్టడమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆపరేషన్ సిందూర్‌లో అసమాన పనితీరు కనబరిచిన రఫేల్ స్క్వాడ్రన్ తదితర విభాగాలకు అవార్డులను ప్రదానం చేశారు. భవిష్యత్తులో ఎదురయ్యే భద్రతా సవాళ్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధులై ఉండాలని ఎయిర్ వారియర్లకు పిలుపునిచ్చారు. పథక రచన సరికొత్తగా, ఆచరణీయంగా ఉండాలన్నారు. శిక్షణ సైతం పోరాటం మాదిరిగానే సాగాలని పిలుపునిచ్చారు.
వింటేజ్ ఫోర్డ్ కారు నడిపిన ఎయిర్ చీఫ్
హిండన్ వైమానిక స్థావరంలో జరిగిన భారత వైమానిక దళం 93వ వార్షికోత్సవానికి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ 1960లనాటి ఫోర్డ్ కారు నడుపుకుంటూ వచ్చారు. ‘ఐఏఎఫ్ 1’అనే నంబర్ ప్లేటును కలిగిన ఈ కారు ఫోర్డ్ సెలూన్ అనే లగ్జరీ వెర్షన్‌కు చెందింది. 1969 జూన్ 30వ తేదీన ఐఏఎఫ్‌లో చేరిన ఈ కారు ప్రస్తుతం పాలంలోని ఎయిర్ ఫోర్స్ మ్యూజియంలో ఉంది. అరుదైన సందర్భాల్లోనే దీనికి బయటకు తీస్తుంటారు. 1969లో అప్పటి ఎయిర్ చీఫ్ మార్షల్ పీసీ లాల్ మొదలు 1992 వరకు ఎయిర్ చీఫ్స్ ఈ ఫోర్డ్ కారును వాడుకున్నారు. 1993లో అప్పటి ఎయిర్ చీఫ్ ఎన్‌సీ సూరి దీనిని మ్యూజియంకు కానుకగా అందజేశారు.