లిక్కర్‌ కుంభకోణంలో ‘హైదరాబాద్‌’ లింకులను కోర్టులో అందిస్తాం

Hyderabad Links With Delhi Liquor Scam Manjinder Singh Sirsa - Sakshi

లిక్కర్‌ కుంభకోణంపై బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా

ఎవరు ఎవరిని కలిశారన్న దానిపై ఆధారాలున్నాయని వెల్లడి

సాక్షి, న్యూఢిల్లీ: సంచలనానికి తెరలేపిన ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంతో హైదరాబాద్‌కు ఉన్న లింకులను కోర్టులో సమర్పిస్తామని బీజేపీ ఢిల్లీ మాజీ ఎమ్మెల్యే మంజిందర్‌ సింగ్‌ సిర్సా తెలిపారు. గతంలో తాము చేసిన ఆరోప ణలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చినందున వివరాలన్నీ అక్కడే చెబుతామన్నారు. ఎంపీ సుధాంశు త్రివేది, బీజేపీ ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్‌గుప్తాలతో కలిసి గురువారం ఇక్కడి బీజేపీ కేంద్ర కార్యాలయంలో మంజిందర్‌ సింగ్‌ మీడియాతో మాట్లాడారు. లిక్కర్‌ కుంభకోణం వ్యవహారంలో హైదరాబాద్‌ నుంచి ఎవరెవరు ఢిల్లీకి వచ్చారు, ఎవరెవరిని కలిశారు... ఢిల్లీ నుంచి ఎవరు హైదరాబాద్‌ వెళ్లి ఎవరెవరిని, ఎప్పుడు కలిశారు.. అనే వాటి గురించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.

హైకోర్టు స్టే విధించిన కారణంగా ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్న వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడట్లేదన్నారు. ఢిల్లీలో అక్రమంగా లిక్కర్‌ ద్వారా వచ్చిన డబ్బులను పంజాబ్, గోవా ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ ఖర్చు పెట్టిందని సుధాంశు త్రివేది, ఆదేశ్‌గుప్తా ఆరోపించారు. అవినీతిని అంతం చేస్తా అని అధికారంలోకి వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీలో అవసరానికి మించి లిక్కర్‌ సరఫరా చేశారని, బ్లాక్‌ దందా అంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఢిల్లీ నుంచే సప్లయ్‌ అయిందని ఆరోపించారు. కేజ్రీవాల్‌ ఆయన మిత్రులకు లాభం చేకూర్చారని, నిందితుడు అమిత్‌ అరోరాపై జరిగిన స్టింగ్‌ ఆపరేషన్‌లో అన్ని విషయాలు బయట పడ్డాయన్నారు. ఇప్పటికైనా కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: చరిత్రలో ఈ నరమేధ గాథ ఎక్కడ?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top