వ్యాక్సిన్‌ వచ్చేసింది : రిజిస్ట్రేషన్‌ ఎలా?

how to register Co-WIN app likely to be used for COVID-19 India vaccine  - Sakshi

టీకా పంపిణీ కోసం ‘కో-విన్‌' అప్లికేషన్‌

‘కో-విన్‌’ యాప్‌ వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ 

త్వరలోనే గూగుల్‌ స్టోర్‌, ఆపిల్‌ స్టోర్లలో అందుబాటులోకి

వివరాల నమోదుకు ఫొటో ఐడీ తప్పనిసరి

సాక్షి, న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి  అంతానికి దేశంలో తొలి స‍్వదేశీ వ్యాక్సిన్‌తోపాటు, మరో వ్యాక్సిన్‌కు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ లభించిన తరుణంలో మొత్తం టీకా ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి, రియల్ టైమ్ కోవిడ్ వ్యాక్సిన్ డెలివరీని పర్యవేక్షించడానికి భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక యాప్‌ను అభివృద్ధి చేసింది. ‘కో-విన్’  పేరుతో ఈ  యాప్‌ను ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్  ప్రకటించారు. ఇందులో టీకా కోసం ప్రజలు నమోదు చేసుకోవడంతోపాటు, వినియోగదారుల డేటాను రికార్డ్‌ చేయనున్నారు. కో-విన్ డిజిటల్ ప్లాట్‌ఫాంలో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునేలా మొబైల్ అప్లికేషన్‌ను పొందుపర్చామని రాజేష్ భూషణ్ తెలిపారు. ప్రీ-ప్రొడక్ట్ దశలో ఉన్న ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌, యాప్‌ స్టోర్‌లో అందుబాటులోకి రానుందనీ, తద్వారా టీకా కోసం తమను తాము నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా ఐదు మాడ్యూల్స్‌ను పొందుపరిచారు. అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, టీకా మాడ్యూల్, లబ్ధిదారుల రసీదు మాడ్యూల్ , రిపోర్ట్ మాడ్యూల్  ఉంటాయని ఆయన  పేర్కొన్నారు. (గుడ్‌న్యూస్: ఈ నెల 13 నుంచి కరోనా వ్యాక్సినేషన్‌)

గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి ‘కొ-విన్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ ప్రజలకు ఈ నమోదు ప్రక్రియ ప్రస్తుతానికి అందుబాటులోకి లేదు. ఆరోగ్య అధికారులు, ఫ్రంట్‌లైన్ కార్మికులకు మాత్రమే నమోదుకు అనుమతి.  వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు ముందుగా వ్యాక్సిన్‌ వేస్తారు. టీకా కోసం ఇప్పటికే లక్ష మందికి పైగా  ఆరోగ్య సిబ్బంది నమోదు చేసుకున్నట్టు సమాచారం. ఆ తరువాది దశలో కో-విన్‌ లో రిజిస్టర్‌ అయిన వారికే టీకా వేస్తారు. ముఖ్యం‍గా 50 ఏండ్లు పైబడిన వారు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారికి  టీకా లభించనుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత ప్రజలు నమోదు చేసుకునేందుకు  ఏదేని ప్రభుత్వ గుర్తింపు కార్డు , ఇతర వివరాలను అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తదితరకార్డులను అప్‌లోడ్ చేసి నమోదు చేసుకోవచ్చు. భారత్‌లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. డ్రైరన్‌ ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా వాక్సినేషన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.ఈ నేపథ్యంలో వాక్సినేషన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ ఎలానో ఒకసారి చూద్దాం.

కో-విన్‌ : ఐదు విభాగాలు
దేశంలో సాధారణ టీకా కార్యక్రమాల కోసం కేంద్రం ‘ఈవిన్‌' (ఎలక్ట్రానిక్‌ వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) అని పిలుస్తారు. తాజాగా కొవిడ్‌-19 టీకాను కోట్లాది మంది భారతీయులకు అందుబాటులోకి తెచ్చేలా అత్యాధునిక ఫీచర్లతో, ఆధునిక సామర్థ్యంతో కో-విన్‌ (కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌) యాప్‌ను కేంద్రం తీసుకొస్తోంది.

  • రిజిస్ట్రేషన్‌, అడ్మినిస్ట్రేటర్‌, వ్యాక్సినేషన్‌, బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌, రిపోర్టు అనే ఐదు విభాగాలుంటాయి. 
  • రిజిస్ట్రేషన్‌: ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌ వర్కర్స్‌ కానటువంటి సాధారణ ప్రజలు వ్యాక్సినేషన్‌ కోసం ‘కొ-విన్‌'లోని ‘రిజిస్ట్రేషన్‌ విభాగం’లో రిజిస్టర్‌ కావొచ్చు. దీనికి ఫొటో ఐడెంటిటీ అవసరం.
  • అడ్మినిస్ట్రేటర్‌: వ్యాక్సిన్‌ అవసరమైన ప్రజలు యాప్‌లో నమోదు చేసిన సమాచారాన్ని ఈ విభాగంలో అధికారులు పర్యవేక్షిస్తారు.  
  • వ్యాక్సినేషన్‌: వ్యాక్సిన్‌ పంపిణీ ఏ స్థాయిలో ఉన్నది? ఎంత మంది వ్యాక్సిన్‌ వేసుకున్నారు? అర్హుల జాబితా తదితర అంశాలు ఉంటాయి.
  • బెనిఫిషియరీ ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌: టీకా వేసుకున్న లబ్ధిదారుల మొబైల్‌లకు ‘వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు’ ఎస్సెమ్మెస్‌ పంపిస్తారు. క్యూఆర్‌ ఆధారిత ధ్రువపత్రాన్ని కూడా జారీ చేస్తారు. 
  • రిపోర్టులు: ఎన్ని వ్యాక్సిన్‌ సెషన్లు పూర్తయ్యాయి? ఒక్కో వ్యాక్సిన్‌ సెషన్‌కి ఎంత మంది హాజరయ్యారు? ఎంత మంది గైర్హాజరయ్యారు వంటి రిపోర్టులు ఇందులో ఉంటాయి.

‘కో-విన్‌'లో రిజిస్ట్రేషన్ ఎలా?
యాప్‌లో రిజిస్ట్రేషన్‌, వివరాల నమోదులో భాగంగా ఫొటో ఐడెంటిటీని (ఓటర్‌ ఐడీ, ఆధార్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాస్‌పోర్టు, పెన్షన్‌ ధ్రువ పత్రం) అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. నమోదు ప్రక్రియ పూర్తయ్యాక.. వ్యాక్సిన్‌ వేసే తేదీ, సమయం, ప్రాంతం వివరాలు రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌కు ఎస్సెమ్మెస్‌ రూపంలో వస్తాయి.  కాగా దేశంలో ఆక్స్‌ఫర్డ్‌, అస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన సీరం ఉత్పత్తి చేస్తున్న కోవీషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ రూపొందిస్తున్న దేశీయ తొలి వ్యాక్సిన్‌ కోవాక్సిన్‌కు‌ షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా ఆదివారం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రపంచంలోనే తమ వ్యాక్సిన్‌ ఉత్తమమైందని భారత్‌ బయోటెక్‌  చైర్మన్ కృష్ణ ఎల్లా, డైరెక్టర్‌  సుచిత్రా ఎల్లా  ప్రకటించడం గమనార్హం.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top