పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో టీఎంసీ చీలికతో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నెగ్గిన రీతాబ్రత బెనర్జీ నేతృత్వంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో భారీ తిరుగుబాటు చెలరేగింది. మొత్తం 80 మంది ఎమ్మెల్యేల్లో 60 మంది ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడం.. పార్టీ అధినేత్రి మమతా బెనర్జీపై తీవ్ర సవాల్‌ను విసిరినట్లయ్యింది. అసలు ఇంత తక్కువ టైంలో.. ఇంత పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలను ఆయన ఎలా తనవైపు తిప్పుకోగలిగాడని రాజకీయ వర్గాలన్నీ ఆశ్చర్యపోతున్నాయి?..
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిన వెంటనే పార్టీలో అసంతృప్తి వేగంగా పెరిగింది. పార్టీ అధినేత్రి నివాసంలో జరిగిన కీలక సమావేశానికి 80 మంది ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది(దాదాపు 60 మంది) గైర్హాజరు కావడం పరిస్థితి తీవ్రతను చూపించింది. అంతేకాకుండా, మమతా నిర్వహించిన బహిరంగ నిరసన కార్యక్రమానికి కూడా చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరుకావడం పార్టీలో లోతైన విభేదాలను బయటపెట్టింది. విశ్లేషకుల ప్రకారం.. ఇది సిద్ధాంత ఆధారిత తిరుగుబాటు కాదు. ఇది మమతా నాయకత్వంపై అసంతృప్తి, అలాగే ప్రతిపక్ష నేత పదవి సహా అధికార పంపకాలపై ఉన్న ఆగ్రహం కలయికగా కనిపిస్తోంది. అలాగే..
తాజా రాజకీయ సంక్షోభానికి కేంద్రబిందువుగా నిలిచింది మాత్రం అసెంబ్లీలో లీడర్ ఆఫ్ ద్ ఒపోజిషన్ (LoP) నియామకంపై వచ్చిన వివాదం. తృణమూల్‌లోని కొందరు ఎమ్మెల్యేలు తమ సంతకాలను ఫోర్జరీ చేసి సోభందేబ్ చటోపాధ్యాయ్‌ను ఎల్వోపీగా ప్రకటించారన్న ఆరోపణలు బయటకు వచ్చాయి. ఈ వ్యవహారంపై ఫిర్యాదు రావడంతో రీతాబ్రత బెనర్జీ సహా ఇద్దరు ఎమ్మెల్యేలను పార్టీ “అంతర్గత వ్యతిరేక కార్యకలాపాలు” పేరిట మమతా బెనర్జీ బహిష్కరించారు. దీంతో రీతాబ్రత నేతృత్వంలోని వర్గం ఒక్కసారిగా తెరపైకి వచ్చింది.
రీతాబ్రత మాములోడేం కాదు..
రీతాబ్రత బెనర్జీ.. పుట్టింది 15 నవంబర్ 1979. చదువంతా కోల్‌కతాలోనే సాగింది. విద్యార్థి రాజకీయాల ద్వారా ప్రారంభమైన ఆయన ప్రయాణంలో ఎస్‌ఎఫ్‌ఐలో కీలక నాయకుడిగా ఎదిగి.. సీపీఎం యువజన విభాగంలో సుమారు ఎనిమిదేళ్లు క్రియాశీలంగా పనిచేశారు. 34 ఏళ్ల వయసులో సీపీఎం తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికై జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే 2017లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాల ఆరోపణలతో సీపీఎం నుంచి సస్పెండ్ అయ్యి, తరువాత బహిష్కరణకు గురయ్యారు. అనంతరం..
తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర రాజకీయాల్లో తిరిగి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఉలుబేరియా పూర్వ (Uluberia Purba) నియోజకవర్గం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రుద్ర ప్రసాద్ బెనర్జీపై సుమారు 11 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఆ వెంటనే పార్టీ అంతర్గత వివాదాలు, అసంతృప్తి, ఫోర్జరీ సంతకాల ఆరోపణల వివాదం నేపథ్యంలో టీఎంసీ నుంచి బహిష్కరణకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ లోపల తిరుగుబాటు వర్గానికి నాయకత్వం వహించడమే కాదు.. ప్రతిపక్ష నేతగా తనను తాను ప్రకటించుకుని, ఆ గుర్తింపు ఇవ్వాలంటూ స్పీకర్‌కు దరఖాస్తు కూడా చేసుకున్నారు.
అసలు ‘టర్నింగ్ పాయింట్’ ఇదే
బెంగాల్ రాజకీయ విశ్లేషకుల ప్రకారం.. టీఎంసీలో చీలిక(తిరుగుబాటు) ఒక్కరోజులో జరిగినది కాదు. దీని వెనుక మూడు కీలక దశల్లో జరిగింది..
1) ఎన్నికల తర్వాత అసంతృప్తి పెరుగుదల: తాజా ఎన్నికల తర్వాత పార్టీ లోపల నాయకత్వంపై అసంతృప్తి వేగంగా పెరిగింది. నిర్ణయాలు కేంద్రీకృతంగా (centralized) మమతా–అభిషేక్ బెనర్జీ ద్వయం చేతుల్లోనే ఉండటంపై చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు.
2) ‘సైడ్‌లైనింగ్’ భావన: పార్టీ టికెట్ దక్కినా, ప్రభుత్వ–పార్టీ నిర్ణయాల్లో తమకు ప్రాధాన్యం లేదని అనేక మంది సీనియర్, మిడ్-లెవల్ ఎమ్మెల్యేలు భావించారు. బెంగాల్ రాజకీయ భాషలో దీనిని “অবহেলা” (అవహేళన) భావనగా పేర్కొంటారు.
3) రీతాబ్రత ఎంట్రీ.. “అసంతృప్త వేదిక”గా మారడం: ఇక్కడే అసలు ట్విస్ట్. రీతాబ్రత బెనర్జీ కొత్త ఎమ్మెల్యే అయినప్పటికీ, ఆయనకు ముందే రాజకీయ అనుభవం ఉంది. రాజ్యసభలో టీఎంసీ, లెఫ్ట్ రెండింటిలో పని చేసిన నేపథ్యం ఉంది. దీనివల్ల ఆయనను “అనుభవజ్ఞుడైన అవుట్‌సైడర్”గా కొంతమంది నేతలు చూశారు.
రీతాబ్రత రెబల్స్ గ్రూప్‌నకు ప్రాతినిధ్యం వహించడంలో రాజకీయ వ్యూహమే కీలకంగా మారింది. ప్రత్యక్షంగా పార్టీకి వ్యతిరేకంగా కాకుండా “నిర్ణయాల పునర్వ్యవస్థీకరణ” అనే నినాదంతో ఆయన అసంతృప్త ఎమ్మెల్యేలను ఒక చోటుకి చేర్చడంలో సక్సెస్ అయ్యారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఎంపిక విషయంలో.. ఫోర్జరీ సంతకాల ఆరోపణ తర్వాత ఏర్పడిన గందరగోళాన్ని ఆయన తన వైపు మలుచుకున్నాడు. తన సస్పెన్షన్‌తో “పార్టీ లోపల న్యాయం లేదు” అనే భావనను టీఎంసీ శ్రేణుల్లో బలపరిచగలిగారు. తద్వారా.. రాజకీయంగా హై-ప్రొఫైల్ కాకపోయినా, అతను లోపలే నెట్‌వర్క్ నిర్మించుకున్నారు. ముఖ్యంగా జిల్లా స్థాయి అసంతృప్త నేతలతో సంబంధాలు పెంచుకున్నారు. మరీ ముఖ్యంగా.. బెంగాల్ రాజకీయాల్లో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ నిర్ణయాలు మమత చేతిని ఎప్పుడో దాటేసి పూర్తిగా అభిషేక్ బెనర్జీ ప్రభావంలోకి వెళ్లాయని భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ రీతాబ్రతకు అనుకూలంగా మారాయి.
పరిశీలకులు గతంలో మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ పార్టీల్లో జరిగిన తిరుగుబాట్లతో పోలుస్తున్నారు. అయితే అక్కడికి, ఇక్కడికి చాలా తేడా ఉంది. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీల్లో సిద్ధాంత బలం ఉంది. కానీ, టీఎంసీలో అలాంటిది మచ్చుకైనా కనిపించదని విశ్లేషకుల మాట. అందుకే ఇక్కడ తిరుగుబాటు ఒక ఐడియాలజీపై కాకుండా, నాయకత్వ అసంతృప్తి, అధికార పంపకాలపై ఆధారపడి ఉందని భావిస్తున్నారు.
ఇప్పటి పరిస్థితుల్లో మమతా బెనర్జీకి రెండు పెద్ద సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకటి.. పార్టీలో తిరుగుబాటును నియంత్రించడం. రెండోది.. అధికార కేంద్రాన్ని తిరిగి స్థిరపరచడం. పార్టీలో ఉన్న అన్ని వర్గాలు విడిపోకుండా ఒకటిగా ఉండేలా చేయగల నాయకురాలిగా మమతా మళ్లీ తన సామర్థ్యాన్ని చూపించుకోగలగాలి..
కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే.. మొదటిసారి ఎమ్మెల్యే నెగ్గిన ఉన్న నాయకుడు 60 మంది ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకోవడం తృణమూల్ కాంగ్రెస్‌లో లోపలి బలహీనతలను బయటపెట్టింది. అంతేకాదు.. తాము మమతా బెనర్జీ నాయకత్వంలోనే ముందుకు సాగుతామని రీతాబ్రతా ప్రకటించడం ఈ మొత్తం ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్. దీంతో.. ఇది కేవలం నాయకత్వ సంక్షోభమా? లేదంటే పెద్ద రాజకీయ విభజనకు సంకేతమా? అనేది రాబోయే రోజుల్లో తేలిపోనుంది.


