Heart Warming Story: Woman Saves Daughter In Law By Donating Kidney - Sakshi
Sakshi News home page

ఈ అత్త మహా మొండిఘటం.. కోడలి ప్రాణం కోసం త్యాగం.. చివరకు ఏమైందంటే..

Published Sat, Aug 5 2023 9:15 PM | Last Updated on Sun, Aug 6 2023 5:58 PM

Heart Warming Story: woman saves daughter in law by donating kidney - Sakshi

జీవితం సంతోషంగా సాగుతున్న టైంలోనే కదా మనిషికి కష్టాలు వచ్చేవి. అలా ఆమెకూ అనుకోని కష్టం వచ్చి పడింది. హఠాత్తుగా తీవ్ర అనారోగ్యం బారినపడ్డ అమిషాకు.. కిడ్నీ జబ్బు ఉన్నట్లు డాక్టర్లు చెప్పడంతో ఆమె, ఆమె భర్త జితేష్‌ కుదేలయ్యారు. పైగా రెండు కిడ్నీలు దెబ్బతిని.. వ్యాధి ప్రాణాంతక దశకు చేరుకుందని.. వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌ చేస్తేనే ఆమె బతికేదని తేల్చి చెప్పడంతో.. కుంగిపోసాగారు ఆ భార్యాభర్తలు. 

ముంబైకి చెందిన అమిషా జితేష్‌ మోటా(43)కు రెండు కిడ్నీలు దెబ్బతిని.. జబ్బు అడ్వాన్స్‌డ్‌ స్టేజీకి చేరిందని డాక్టర్లు చెప్పారు. కిడ్నీ మారిస్తేనే ఆమె బతుకుతుందన్నారు.  అమిషా భర్త జితేష్‌కు అంతకు కొన్నిరోజుల ముందే షుగర్‌ వచ్చింది. దీంతో ఆయన కిడ్నీ డొనేట్‌ చేయడం కుదరదని వైద్యులు తేల్చారు. అమిషా తల్లిదండ్రులతో పాటు రక్తసంబంధీకులను ముందుకురాగా..  వైద్య ప్రమాణాల దృష్ట్యా అది వీలుకాలేదని వైద్యులు తెగేసి చెప్పారు. అంతా చీకట్లు అలుముకున్న తరుణంలో.. అనుకోని వ్యక్తి రూపంలో ఓ వెలుగురేఖ  కిడ్నీ దానానికి ముందుకొచ్చింది. ఆమె పేరు ప్రభ కంటిలాల్‌ మోటా. జితేష్‌ తల్లి.. అమిషా అత్త. కానీ.. 

ప్రభ వయసు 70 ఏళ్లు. వయసురిత్యా ఆమె కిడ్నీ ఇచ్చేందుకు సరిపోతారా? అనే విషయంలో వైద్యులు తర్జన భర్జనలు చేశారు. ఆశ్చర్యంగా అన్ని టెస్టుల్లోనూ ఆమె ఫిట్‌గా తేలారు. అయినప్పటికీ వైద్యుల నుంచి ఆమెకు చెప్పాల్సింది చెప్పారు. భర్త, ఇద్దరు కొడుకులు వద్దని వారించినా ఆమె వినలేదు. చివరకు.. అమిషా కూడా వద్దని బతిమాలుకుంది. మొండిగా తన కోడలి ప్రాణం కాపాడుకునేందుకే ముందుకు వచ్చారు ప్రభ. ఆ అత్త సంకల్పానికి తగ్గట్లే.. కిడ్నీ కూడా అమిషాకు మ్యాచ్‌ అవుతుందని వైద్యులు ప్రకటించారు. 

ఆరోగ్యం క్షీణిస్తూ అమిషా పడుతున్న బాధను మా అమ్మ చూడలేకపోయింది. అందుకే ఆమెను కాపాడాలనుకుంది. వద్దని నేను, నా సోదరుడు ఆమెను ఎంతో బతిమాలాం. మా నాన్న కూడా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా కోడలి కోసం మా అమ్మ సాహసం చేసింది. 

‘‘అమిషా నా బిడ్డ లాంటిది.. బిడ్డను కాపాడుకునేందుకు ఒక తల్లి ఎంతదాకా అయినా వెళ్తుంది కదా’’ అని ప్రభ తేల్చేశారు.  

కిందటి నెలలో నానావతి ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. డాక్టర్‌ జతిన్‌ కొఠారి నేతృత్వంలో విజయవంతమైంది. అంతా హ్యాపీస్‌.. ఆ అత్తాకోడళ్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నారు.  సర్జరీ నుంచి కోలుకున్న ప్రభ.. ఆగష్టు 4వ తేదీన తిరిగి ఇంటికి చేరుకున్నారు. కుటుంబం.. చుట్టుపక్కల వాళ్లు ఆమెకు ఘనస్వాగతం పలికారు. అమిషా తల్లి ఆమెను హత్తుకుని కంటతడి పెట్టుకుంది. తల్లిగా తాను జన్మ ఇచ్చినప్పటికీ, అత్తమ్మగా.. అదీ కిడ్నీ దానంతో పునర్జన్మ ఇచ్చిందంటూ భావోద్వేగానికి లోనైంది.    

సమాజంలో అత్తాకోడళ్లంటే.. ఎప్పుడూ కస్సుబుస్సు లాడుతూనే ఉండాలా? కలిసి ‘సెల్ఫీ’లు తీసుకుని ప్రేమలు ప్రదర్శిస్తే సరిపోతుందా?.. ప్రభ-అమిషా ప్రేమానురాగాల గురించి తెలిశాక ఇది కదా మనకు కావాల్సింది అనిపించకమానదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement