పంజాబ్‌ రైతులను అడ్డుకున్న హరియాణా పోలీసులు | Haryana Police halt Punjab farmers Delhi march over proposed India-US trade deal | Sakshi
Sakshi News home page

పంజాబ్‌ రైతులను అడ్డుకున్న హరియాణా పోలీసులు

Jul 22 2026 5:59 AM | Updated on Jul 22 2026 5:59 AM

Haryana Police halt Punjab farmers Delhi march over proposed India-US trade deal

శంభు సరిహద్దు వద్దకు భారీగా తరలివచ్చిన రైతులు

ఢిల్లీలో జరిగే మహా పంచాయత్‌కు వెళ్లకుండా సరిహద్దు మూసివేత 

హరియాణా వ్యవసాయ మంత్రికి వినతి పత్రం..ఆపై తిరుగుపయనం

శంభు/అంబాలా: అమెరికాతో కేంద్రం కుదుర్చుకోనున్న వాణిజ్యం ఒప్పందానికి వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన మహా పంచాయత్‌కు వస్తున్న పంజాబ్‌ రైతులను హరియాణా పోలీసులు మంగళవారం అడ్డుకున్నారు. హరియాణాలోకి ప్రవేశించకుండా శంభు సరిహద్దుల్లో ముందు జాగ్రత్తగా బారికేడ్లను, సిమెంటు దిమ్మెలను రోడ్డుకు అడ్డంగా ఉంచారు. రైతుల డిమాండ్‌ మేరకు హరియాణా వ్యవసాయ మంత్రి శ్యామ్‌ సింగ్‌ రాణా అక్కడికి వచ్చారు. అక్కడ పెద్ద సంఖ్యలో చేరిన రైతులతో ఆయన మాట్లాడారు. డిమాండ్లను తెలుసుకున్నారు. వారి నుంచి మెమోరాండం అందుకున్నారు.

కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, రైతు సంఘాల నేతల మధ్య 10 రోజుల్లోగా సమావేశం ఏర్పాటు చేయడం, నిర్బంధంలో ఉన్న రైతు నేతలను విడుదల చేయడం వంటి డిమాండ్లను నెరవేరుస్తామని వారికి హామీ ఇచ్చారు. దీంతో, తమ తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామంటూ రైతులు తిరుగు పయనమయ్యారు.  ఢిల్లీలోని కిసాన్‌ ఘాట్‌లో దేశ్‌ బచావో మోర్చా పేరుతో రైతు సంఘాలు మంగళవారం కిసాన్‌ మహాపంచాయత్‌ తలపెట్టాయి. ఈ కార్యక్రమానికి పంజాబ్, హరియాణా, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రైతులు తరలివచ్చారు.

ఇందులో భాగంగా పంజాబ్‌ నుంచి వివిధ రైతు సంఘాలకు చెందిన సుమారు వెయ్యి మంది రైతులు మంగళవారం శంభు సరిహద్దు వద్దకు చేరుకున్నారు. సరిహద్దు దాటాక బస్సుల్లో ఢిల్లీకి చేరాలనేది వారి ప్రణాళిక. అయితే, అధికారులు ముందు జాగ్రత్తగా శంభు వద్ద భారీగా బందోబస్తుతోపాటు బారికేడ్లు, సిమెంటు దిమ్మెలను ఘగ్గర నదీ వంతెనపై ఏర్పాటు చేశారు. వాటర్‌ కెనన్‌ వాహనాలను సిద్ధంగా పెట్టారు. పొరుగునే ఉన్న అంబాలా జిల్లాలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. పోలీసులు ఖనౌరీ, షాహాబాద్, కర్నాల్‌ బోర్డర్‌ పాయింట్ల వద్ద కూడా రైతులను అడ్డుకున్నారు. అయితే, బోర్డర్‌ పాయింట్ల మూసివేతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement