కరోనా బాధిత బాలలను కాపాడుకుందాం

Government issued guidelines for children affected by corona - Sakshi

రాష్ట్రాలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు

జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు శాఖ, పంచాయతీరాజ్‌ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు బాధ్యతలు

న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి వల్ల ప్రభావితులైన చిన్నారుల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని  రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ సూచించింది. కరోనా బాధిత బాలల రక్షణపై తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయంలో జిల్లా మేజిస్ట్రేట్లు, పోలీసు శాఖ, పంచాయతీరాజ్‌ సంస్థలు, పట్టణ స్థానిక సంస్థలకు బాధ్యతలు అప్పగించింది.  కరోనా వల్ల దేశంలో ఇప్పటిదాకా 9,346 మంది పిల్లలు తమ తల్లిదండ్రుల్లో ఒకరిని పోగొట్టుకున్నారని, వీరిలో 1,700 మంది బాలలు ఇద్దరినీ కోల్పోయారని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ (ఎన్‌సీపీసీఆర్‌) సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో స్పష్టం చేసిందని గుర్తు చేసింది.  

కేంద్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మార్గదర్శకాలు
► కోవిడ్‌తో ప్రభావితులైన చిన్నారులను సర్వేల ద్వారా గుర్తించాలి. ప్రతి ఒక్క చిన్నారి సమగ్ర సమాచారాన్ని సేకరించాలి. ఆ అవసరాలను  ట్రాక్‌ చైల్డ్‌ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలి.
► తల్లిదండ్రులిద్దరూ కరోనా బారినపడితే వారి పిల్లలను తాత్కాలికంగా శిశు సంరక్షణ కేంద్రాల్లో చేర్పించాలి.  ఆలనాపాలనా చూసేవారు  లేకపోతే  సాయం అందజేయాలి.
► శిశు సంరక్షణ పథకాల కింద బాధిత పిల్లల పునరావాసం కోసం వెంటనే తాత్కాలిక ఏర్పాట్లు చేయాలి.
►  శిశు సంరక్షణ కేంద్రాల్లో  కరోనా సోకిన చిన్నారులకు అక్కడే ఐసోలేషన్‌ గదులు సిద్ధం చేయాలి.
► పిల్లలో మానసిక సమస్యలు తలెత్తకుండా సైకాలజిస్టుల కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.  
► కరోనా వల్ల అనాథలుగా మారిన బాలలలకు జిల్లా కలెక్టర్లు సంరక్షకులుగా వ్యవహరించాలి.
► బాధిత బాలల అవసరాలను గుర్తించి, వాటిని తీర్చేందుకు, ప్రభుత్వం అందజేసే ప్రయోజనాలను వారికి చేరవేసేందుకు కలెక్టర్లు ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసుకోవాలి.
► కరోనా వల్ల తల్లిదండ్రులను పోగొట్టుకొని అనాథలైన పిల్లల ఆస్తులు పరులపాలు కాకుండా కాపాడాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే. ఇందుకోసం రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగం సేవలు ఉపయోగించుకోవాలి.  
► బాధిత పిల్లలపై వేధింపులు, వారి అక్రమ రవాణా, అక్రమ దత్తత, బాల్య వివాహాలు, బాల కార్మికులుగా మారడంపై పోలీసు శాఖ నిరంతరం దృష్టి పెట్టాలి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top