గుడ్‌న్యూస్‌: కేంద్రం నిర్ణయంతో.. తగ్గిన వంట నూనెల ధరలు

Good News On Cooking Oil Prices - Sakshi

దేశీయంగా పడిపోయిన ధరలు

ఇంపోర్ట్‌ డ్యూటీ తగ్గించడమే కారణం 

బియ్యం, గోధుమల ధరలు సైతం తగ్గడంతో వినియోగదారులకు ఊరట

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌లో వంట నూనెల ధరలు పెరిగినప్పటికీ భారత్‌లో మాత్రం తగ్గముఖం పట్టడం విశేషం. దిగుమతి పన్నును కేంద్ర ప్రభుత్వం తగ్గించడమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. అంతర్జాతీయంగా ధరలు 1.95 శాతం నుంచి 7.17 శాతం దాకా ఎగబాకాయి. మనదేశంలో ఇంపోర్ట్‌ డ్యూటీని తగ్గించాక ధరలు 3.26 శాతం నుంచి 8.58 శాతం వరకూ పడిపోయాయి.

కేంద్రం తీసుకున్న నిర్ణయంతో వినియోగదారులకు కొంత ఉపశమనం లభించింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గత నెల రోజుల్లో సోయాబీన్‌ నూనె, పొద్దుతిరుగుడు నూనె, ముడి పామాయిల్, ఆర్‌బీడీ పామోలీన్‌ ధరలు వరుసగా 1.85 శాతం, 3.15, 8.44, 10.92 శాతం పెరిగినట్లు స్పష్టమవుతోంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఆయా నూనెల ధరలు భారత్‌లో సెప్టెంబర్‌ 11 నుంచి ఇంపోర్ట్‌ డ్యూటీని తగ్గించడంతో భారీగా తగ్గాయి. 

పెరిగిన పప్పుల ధరలు 
భారత్‌లో గత ఏడాది కాలంగా గోధుమల ధరలు సైతం నేల చూపులు చూస్తున్నాయి. హోల్‌సేల్, రిటైల్‌ ధరలు వరుసగా 5.39 శాతం, 3.56 శాతం తగ్గాయి. గత నెల రోజుల్లో బియ్యం ధరలు హోల్‌సేల్‌ మార్కెట్‌లో 0.07 శాతం తగ్గగా రిటైల్‌ మార్కెట్‌లో మాత్రం 1.26 శాతం పెరగడం గమనార్హం. ధాన్యం, గోధుమలకు కనీస మద్దతు ధరలను(ఎంఎస్పీ) కేంద్ర ప్రభుత్వం పెంచిన సంగతి తెలిసిందే. ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,940, గోధుమల ధర క్వింటాల్‌కు రూ.1,975గా నిర్ధారించింది. అయినప్పటికీ దేశీయంగా బియ్యం, గోధుమల ధరలు తగ్గడం వినియోగదారులకు ఊరట కలిగించే పరిణామమే. అదే సమయంలో కొన్ని పప్పు ధాన్యాల ధరలు పెరిగాయి. బంగాళాదుంపల ధర గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా సగటున 44.77 శాతం తగ్గింది. ఉల్లిపాయలు, టమోటా ధరలు సైతం తగ్గాయి. ఉల్లిపాయల ధర సగటున 17.09 శాతం, టమోటాల ధర సగటున 22.83 శాతం తగ్గినట్లు తేటతెల్లమవుతోంది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top