'విజ‌య్‌ను గ‌వ‌ర్న‌ర్ అందుకే అడ్డుకుంటున్నారు' | TN Congress Leaders Accuse Governor, Why Vijay Have To Prove Majority Before The Governor? Read Story Inside | Sakshi
Sakshi News home page

గవర్నర్‌కు మరో మార్గం లేదు: కాంగ్రెస్ నేత‌

May 7 2026 4:52 PM | Updated on May 7 2026 6:37 PM

Girish Chodankar: Why Vijay have to prove majority before the Governor?

చెన్నై: త‌మిళ‌నాడులో టీవీకే ప్ర‌భుత్వం ఏర్పాటు కాకుండా అడ్డుప‌డుతున్న గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర విశ్వ‌నాథ్  అర్లేక‌ర్‌పై ప‌లువురు నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. విజ‌య్‌ను ముఖ్య‌మంత్రి కాకుండా చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపిస్తున్నారు. ప్ర‌జాతీర్పును అప‌హాస్యం చేసేలా వ్య‌వ‌హరిస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. రాజ్యాంగ‌బ‌ద్దంగా న‌డుచుకోకుండా, బీజేపీ ఆడించిన‌ట్టు ఆడుతున్నార‌ని మండిప‌డుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ వైఖ‌రి ఇలాగే కొన‌సాగితే ప్ర‌జ‌ల ఆగ్ర‌హాన్ని చవి చూడాల్సి వ‌స్తుందని హెచ్చ‌రిస్తున్నారు.

గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్ బీజేపీకి గులాంగిరీ చేస్తున్నార‌ని తమిళనాడు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ గిరీష్ చోడంకర్ ఆరోపించారు. గురువారం చెన్నైలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడికి గ‌వ‌ర్న‌ర్ త‌లొగ్గార‌ని ధ్వ‌జ‌మెత్తారు. రాజ్‌భవన్‌లో మెజారిటీ నిరూపించుకోమనే అధికారం గ‌వ‌ర్న‌ర్‌కు లేద‌ని అన్నారు. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు పొందిన టీవీకే విజ‌య్‌కు ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల‌న్నారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత మెజారిటీ నిరూపించుకోవ‌డానికి త‌గిన స‌మ‌యం ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు.

''గ‌వ‌ర్న‌ర్ అర్లేక‌ర్‌కు ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉంది. ​​నరేంద్ర మోదీ, అమిత్ షాల ఒత్తిడి కారణంగా.. గవర్నర్ రాజ్యాంగానికి, తమిళనాడు ప్రజలకు కాకుండా బీజేపీకి తలొగ్గుతున్నారు. ఇది ఎంత మాత్రం క‌రెక్ట్ కాదు. రాజ్‌భవన్‌లో మెజారిటీని నిరూపించుకోమని అడిగే అవకాశం గవర్నర్‌కు రాజ్యాంగం ఇవ్వ‌లేదు. తమిళనాడు ప్రజలు ఇచ్చిన తీర్పును గవర్నర్ తప్పక గౌరవించాలి. మెజారిటీని నిరూపించుకోవడానికి రాజ్యాంగం నిర్దేశించిన వేదిక శాసనసభ. గవర్నర్ ముందు మెజారిటీని ఎందుకు నిరూపించుకోవాలి?

విజయ్‌ను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమని ఆహ్వానించడం తప్ప గవర్నర్‌కు మరో మార్గం లేదు. ప్రభుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత బ‌ల‌నిరూప‌ణ‌కు సమయం ఇవ్వాలి. బీజేపీ ఒక్క ఎమ్మెల్యేతో తమిళనాడును పాలించడానికి ప్రయత్నిస్తోంది. తమిళనాడు ప్రజలు దీన్ని ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అంగీకరించరు. గవర్నర్ దొడ్డిదారిన తన పాలనను రుద్దడానికి, రాష్ట్రాన్ని పాలించడానికి ప్రయత్నిస్తే ప్ర‌జ‌లు తిర‌గ‌బ‌డ‌తారు. లౌకిక పార్టీల‌న్నీ ముందుకు వ‌చ్చి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌హారశైలిని ఎండ‌గ‌ట్టాలి. లౌకికవాదాన్ని విశ్వసించేవారు, తమిళనాడులో బీజేపీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ పాలనను నిరోధించాలనుకునేవారు బయటకు వచ్చి ప్రజల తీర్పుకు మద్దతు ఇవ్వాల‌''ని గిరీష్ చోడంకర్ కోరారు. 

చ‌ద‌వండి: విజ‌య్ కోసం గ‌ళ‌మెత్తిన క‌మ‌ల్‌, ప్ర‌కాశ్‌రాజ్

బీజేపీ క‌నుక‌స‌న్న‌ల్లో గ‌వ‌ర్న‌ర్‌
రాజ్యాంగానికి విరుద్ధంగా గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర అర్లేక‌ర్ వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు సెల్వపెరుంతగై విమ‌ర్శించారు. బీజేపీ ఆదేశాల‌కు అనుగుణంగా గ‌వ‌ర్న‌ర్ న‌డుచుకుంటున్నార‌ని ఆరోపించారు. సెల్వపెరుంతగై గురువారం చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ.. "ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అతిపెద్ద పార్టీని ఆహ్వానించాలి. ఆ తర్వాత బలపరీక్ష జరుగుతుంది. అయితే, ఆయన (గవర్నర్) భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండటానికి ఇష్టపడటం లేదు. బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి అందిన ఆదేశాల మేరకు వ్యవహరిస్తున్నారు. ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. కాంగ్రెస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. మేము టీవీకేకి మద్దతు ఇస్తున్నామనే విషయంలో చాలా స్పష్టంగా ఉన్నామ‌''ని చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement