చెన్నై: తమిళనాడు గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వైఖరిని పలువురు సినిమా ప్రముఖులు తపుబట్టారు. తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే)ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించడంలో తాత్సారం ప్రదర్శించడాన్ని విమర్శించారు. ప్రజల తీర్పును గౌరవించాల్సిన బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు. తమిళనాడు గవర్నర్ వ్యవహరశైలిపై సీనియర్ నటుడు కమల్ హాసన్, విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఎక్స్‌లో స్పందించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను గవర్నర్ ఆహ్వానించకపోవడం తమిళనాడు ప్రజల తీర్పును అవమానించడమేనని కమల్ హాసన్ పేర్కొన్నారు. ''శాసనసభ ఎన్నికల్లో ఏ ఒక్క పార్టీకి కూడా పూర్తి మెజారిటీ రాలేదు. ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని ప్రజలు ఇవ్వలేదు. తమిళనాడు చరిత్రలో ఇది అపూర్వమైన నిర్ణయం. ప్రజల తీర్పును గౌరవించి, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని నా సోదరుడు స్టాలిన్ ప్రకటించారు. ఆయన రాజకీయ పరిణితిని నేను గౌరవిస్తాను.
ఇప్పుడు రాజ్యాంగ బాధ్యతలో ఉన్నవారు కూడా అదే కర్తవ్యాన్ని నెరవేర్చాలి. ఇది డిమాండ్ కాదు, వారి రాజ్యాంగ కర్తవ్యాన్ని గుర్తుచేయడం మాత్రమే. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ 108 స్థానాలను గెలుచుకుంది. 233 మంది ఎన్నికైన సభ్యులు ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించాల్సి ఉంది. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవించాలి. మెజారిటీని రాజ్‌భవన్‌లో కాదు, అసెంబ్లీలో నిరూపించుకోవాలని ఎస్.ఆర్. బొమ్మై కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింద''ని కమల్ హాసన్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు.
గవర్నర్ తీరుపై ప్రకాశ్‌రాజ్ ఫైర్
తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్ కూడా విమర్శలు గుప్పించారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా ప్రవరిస్తున్నారని, ఆయన వైఖరి ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. ''విజయ్‌తో మాకు అభిప్రాయ భేదాలు ఉండవచ్చు. కానీ ఆయనకు అనుకూలంగా ప్రజా తీర్పు వచ్చింది. అసెంబ్లీలో తన హక్కును వినియోగించుకోవడానికి విజయ్‌కు గవర్నర్ అవకాశం ఇవ్వాల''ని ప్రకాశ్‌రాజ్ డిమాండ్ చేశారు. ప్రజల తీర్పును గౌరవించాలని, ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌కు అవకాశం కల్పించాలని కోరారు.
చదవండి: టీవీకే ప్రభుత్వాన్ని నడపగలదా?
తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటుకు అడ్డంకులు కలిగిస్తున్నారని పోసాని కృష్ణ మురళి ఆరోపించారు. గవర్నర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ విజయ్ సంయమనంతో వ్యవహరిస్తున్నారని అన్నారు. కాగా, అన్నివైపుల నుంచి విమర్శలు రావడంలో గవర్నర్ మెత్తబడ్డినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని విజయ్‌కు హామీయిచ్చినట్టు తాజా సమాచారం.


