నమస్కారం తమిళనాడు: ప్రకాశ్‌ రాజ్‌ | How Prakash Raj, Prannoy Roy Reacts on Five State Election Results | Sakshi
Sakshi News home page

రాజకీయ చైతన్యం లేదు: ప్రకాశ్‌ రాజ్‌

May 5 2026 2:36 PM | Updated on May 5 2026 2:47 PM

How Prakash Raj, Prannoy Roy Reacts on Five State Election Results

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై వివిధ రంగాల‌కు చెందిన‌ ప్ర‌ముఖులు సోష‌ల్ మీడియా వేదిక త‌మ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్‌, త‌మిళ‌నాడు ఫ‌లితాల‌పై ఎక్కువ మంది స్పందిస్తున్నారు. బెంగాల్‌లో బీజేపీ విజ‌య దుందుభి మోగించ‌డం, త‌మిళ‌నాడులో విజ‌య్  సంచ‌ల‌న విజ‌యం న‌మోదు చేయ‌డంతో ఈ రెండు రాష్ట్రాల ఫ‌లితాల‌పై సోష‌ల్ మీడియాలో స్పంద‌న అధికంగా ఉంది. ప్ర‌భుత్వాన్ని న‌డిపే స‌త్తా విజ‌య్‌కు ఉందా అని ఒక‌రు సందేహిస్తే, వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుని ప్ర‌జ‌లు మంచి చేయాల‌ని మ‌రొక‌రు హిత‌వు ప‌లికారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్రకాశ్‌ రాజ్‌, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు ప్రణయ్‌ రాయ్‌, రాజ్‌దీప్ స‌ర్దేశాయితో పాటు ప‌లువురు త‌మ అభిప్రాయాల‌ను 'ఎక్స్‌'లో పోస్ట్ చేశారు.

‘అభిమాన’ సమాజం
నమస్కారం తమిళనాడు. కామరాజర్‌ ఓడిపోయారు. ఎం.కె. స్టాలిన్‌ ఓడిపోయారు. సమాజం ‘అభిమాన గణం’గా మారిందే తప్ప, రాజకీయ చైతన్యం పొందలేదని నిరూపితమవుతోంది. రాజకీయ అవగాహన కల్పించే వారి పని ఎప్పుడూ ప్రతిపక్ష పాత్రే. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. విజయం సాధించినవారు ప్రజలకు చేసే సేవ బాగుండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు.
– ప్రకాశ్‌ రాజ్‌, నటుడు

‘టీవీకే’ నడపగలదా?
బెంగాల్‌లో బీజేపీ విజయం కేవలం ప్రజాభిప్రాయంలో మార్పు మాత్రమే కాదు. ఓటర్ల జాబితా సవరణలతో ఆట మైదానాన్ని మార్చినప్పుడు, స్కోర్‌బోర్డు అసలైన ఆటకు ప్రతిబింబంగా ఉండదు. తమిళనాడులో యువత ఒక ‘కొత్త ముఖానికి’ ఓటు వేసినప్పటికీ, సినిమా ఆకర్షణ, సోషల్‌ మీడియా ప్రదర్శనలకు అతీతంగా టీవీకే దగ్గర ఏమైనా విషయం ఉందో లేదో చూడాల్సి ఉంది. కేరళ ఫలితాల్లో యూడీఎఫ్‌ విజయం అతి తక్కువ ఆశ్చర్యం కలిగించేదీ, అత్యంత నిజాయితీతో కూడినదీ అని నా భావన.
– యోగేంద్ర యాదవ్‌, పొలిటికల్‌ సైంటిస్ట్‌

పింగ్‌–పాంగ్‌
బెంగాల్‌లో 15 ఏళ్ల పాలన నుండి కొత్త సైద్ధాంతిక పాలనకు జరిగే ఈ పరివర్తన... రాష్ట్ర పాలనా యంత్రాంగానికి అంతిమ పరీక్ష అవుతుంది. తమిళనాడు తన సంప్రదాయ ‘పింగ్‌–పాంగ్‌’ (రెండు పార్టీల మధ్యనే మారుతుండే) రాజకీయాల నుండి, అంచనా వేయలేని విధంగా మూడో ముఖం వైపు మళ్లింది. కేరళలో యూడీఎఫ్‌ ఆధిక్యత, అక్కడ చారిత్రకంగా నెలకొన్న ‘రివాల్వింగ్‌ డోర్‌’ విధానానికి తిరిగి వెళ్లటంగా మాత్రమే చూడాలి.
– ప్రణయ్‌ రాయ్‌, ఎన్నికల డేటా విశ్లేషకులు

విద్య... ఆరోగ్యం
అధికారంలో మార్పు వచ్చినా, బెంగాల్‌లో లోతుగా పాతుకుపోయిన సమ్మిళిత మేధో సంస్కృతి చెక్కుచెదరకుండా ఉంటుందని, ‘సంకుచిత వర్గవాదం’ దానిని కబళించదని ఆశిస్తున్నాను. తమిళనాడులో కొత్త ఆటగాళ్లు ఆవిర్భవించారు. ఆ మార్పు ప్రజాస్వామ్యానికి మంచిది. అది స్థిరపడిన పార్టీలను అప్రమత్తం చేస్తుంది. కేరళలో భావోద్వేగపూరితమైన మతపరమైన అంశాల కంటే.. పరిపాలన, విద్య, ఆరోగ్యమే ఎప్పటికీ ప్రధానాంశాలుగా ఉంటాయిని ఈ ఫలితాలు మరోసారి రుజువు చేశాయి.
– జావేద్‌ అఖ్తర్‌, గీత రచయిత

విసుగు ఫలితం!
సరిహద్దు జిల్లాల్లో భారీగా హిందువుల ఏకీకరణ, టీఎంసీ స్థానిక నాయకత్వంపై నెలకొన్న విసుగు – వీటి ఫలితమే బెంగాల్‌లో తాజా పరిణామం. తమిళనాడులో, స్థిరపడిన ద్రవిడ భావజాలానికి వ్యతిరేకంగా యువత చేసిన తిరుగుబాటే టీవీకే విజృంభణ. కేరళలో ద్రవ్యోల్బణం, దాదాపు 30 శాతం వరకు ఉన్న నిరుద్యోగం వంటి సమస్యలు ఎల్‌.డి.ఎఫ్‌.పై ప్రభావం చూపాయి.
– రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌

మూడో శక్తి
పశ్చిమ బెంగాల్‌ ఫలితాలు మార్పు కోరు కుంటున్న ప్రజల ఆకాంక్షకు ప్రతిబింబం. కానీ అవి ఆ రాష్ట్ర మేధో చరిత్రను నిర్వచించిన ‘బహుళత్వం’, భావప్రకటనా స్వేచ్ఛ వంటి రాజ్యాంగ విలువలను నిలబెట్టేందుకు రానున్న కొత్త పరిపాలనపై ఒక పెద్ద భారాన్ని కూడా మోపుతాయి. రాజకీయ వారసత్వాలు శాశ్వతం కాదని తమిళ నాడులో ఆవిర్భవించిన మూడో శక్తి నిరూపించగా; కేరళ ఎప్పటిలా తన విశిష్టమైన ప్రజాస్వామ్య విజ్ఞతను ప్రదర్శించింది.                               
– అరుణా రాయ్, ‘మజ్దూర్‌ కిసాన్‌ శక్తి సంఘటన్‌’ సభ్యురాలు

మార్పే బలం
బెంగాల్‌లో ఎన్నికల అనంతర ఘర్షణల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, ప్రజాస్వా మ్యంలోని అత్యంత బలహీన వర్గాల భద్రతను, ముఖ్యంగా మైనారిటీలకు, ప్రతిపక్షానికి ఓటు వేసిన వారికి రక్షణ కల్పించేందుకు కొత్త ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. తమిళనాడులో సంప్రదాయ ద్రవిడ పార్టీలకు ఎదురైన ఎదురు దెబ్బ... చారిత్రక వారసత్వంపై ఆధారపడకుండా క్షేత్రస్థాయి క్రియాశీలత వైపు తిరిగి రావడానికి నాయకులకు ఒక మేల్కొలుపుగా పని చేయాలి. ఇక కేరళలో ప్రభుత్వాలు తరచుగా మారడమే ఆ రాష్ట్రానికి అతి పెద్ద బలం. ఎందుకంటే ఇది ప్రతి నాయకుడిని ఎప్పుడూ అప్రమత్తంగా ఉంచుతుంది.
– హర్ష్‌ మందర్‌, సామాజిక కార్యకర్త, రచయిత

కట్టుబడి లేరు
టీఎంసీని ‘బుజ్జగింపు పార్టీ’గా చిత్రీకరించే ప్రయత్నంలో సఫలం అవటం వల్లే బీజేపీ విజయం సాధించింది. తమిళనాడులో జెన్‌ జడ్, మిలీనియల్‌ ఓటర్లు ఇకపై డీఎంకే– ఏఐఏడీఎంకేకి కట్టుబడి లేరని స్పష్టం అయింది.  కేవలం ఒక సినిమా నటుడికి ఓటు వేయటం మాత్రమే కాదు, ‘ద్వంద్వ పాలనను తిరస్కరించడం’ కూడా అక్కడి ఫలితాలకు సంకేతాలు! కేరళలో గత ఎన్నికల్లో పాక్షికంగా ఎల్‌డిఎఫ్‌ వైపు మళ్లిన తమ సంప్రదాయ  మైనారిటీ ఓటు బ్యాంకును తిరిగి ఆకర్షించుకోగలగడమే యూడీఎఫ్‌ విజయానికి ప్రధాన కారణం.
– నీరజా చౌధరి, రాజకీయ విశ్లేషకురాలు

అందరూ దూరమే!
గ‌త నెలలో నేను మాట్లాడిన దాదాపు ప్రతి జర్నలిస్టు పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కే అనుకూలమని చెప్పారు. కొందరైతే టీఎంసీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని కూడా అంచనా వేశారు. కానీ, పశ్చిమ బెంగాల్‌పై పరిశోధన చేసిన విద్యావేత్తలు మాత్రం టీఎంసీ తీవ్ర ఇబ్బందుల్లో ఉందనీ, బీజేపీ గణనీయమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందనీ అన్నారు. హిందువులు దూరమవ్వడం వల్లే మమతా బెనర్జీ ఓడిపోయారా? ముస్లింలు అధికంగా ఉన్న టాప్‌ 10 నియోజకవర్గాల్లో కూడా టీఎంసీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున మార్పు కనిపించింది. టీఎంసీ నుంచి వచ్చిన హిందూ ఓట్ల కంటే, కాంగ్రెస్, లెఫ్ట్‌ నుంచి వచ్చిన హిందూ ఓట్లనే బీజేపీ ఎక్కువగా సాధించగలిగింది. మరోవైపు, టీఎంసీకి రావాల్సిన ముస్లిం ఓట్లలో పెద్ద భాగాన్ని కాంగ్రెస్, లెఫ్ట్‌ దక్కించుకున్నాయి.
– అనింద్యో చక్రవర్తి, సీనియర్‌ జర్నలిస్ట్‌    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement