Gautam Adani Says We Do Business In 22 States Not All Are With BJP - Sakshi
Sakshi News home page

‘మోదీ వల్లే ఆస్తుల పెరుగుదల’ వాదనలపై గౌతమ్‌ అదానీ కీలక వ్యాఖ్యలు

Jan 8 2023 9:30 AM | Updated on Jan 8 2023 10:26 AM

Gautam Adani Says We Do Business In 22 States Not All Are With BJP - Sakshi

జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మోదీతో పాలసీల గురించి మాట్లాడొచ్చు. కానీ ఆ పాలసీ రూపొందిన తర్వాత అది అందరి కోసం. కేవలం అదానీ గ్రూప్‌ కోసం కాదు.

న్యూఢిల్లీ: ప్రపంచ ధనవంతుల్లో మూడో స్థానంలో కొనసాగుతున్నారు ప్రముఖ వ్యాపారవేత్త, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ అదానీ. వివిధ రంగాల్లో తన వ్యాపారాలను విస్తరిస్తూ కొన్నేళ్లలోనే శిఖరాగ్రానికి చేరుకున్నారు. అయితే, బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలతో ఉన్న సాన్నిహిత్యం వల్లే ఆయన వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ వాదనలపై తాజాగా ఇండియా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు గౌతమ్‌ అదానీ. పీఎం మోదీతో సాన్నిహిత్యంమే తన ఆస్తులు పెరిగేందుకు కారణమైందనే వాదనలను తోసిపుచ్చారు. తాము దేశంలోని 22 రాష్ట్రాల్లో వ్యాపారాలు చేస్తున్నామని, అయితే, అన్ని చోట్ల బీజేపీ ప్రభుత్వం లేదని గుర్తు చేశారు. విపక్షాలతోనూ కలిసి తాము వ్యాపారం సాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.

‘ప్రతి రాష్ట్రంలో గరిష్ఠస్థాయిలో పెట్టుబడులు పెట్టాలని మేము కోరుకుంటున్నాం. ప్రస్తుతం దేశంలోని 22 రాష్ట్రాల్లో అదానీ గ్రూప్‌ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్ని రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాదు. ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మాకు ఎలాంటి సమస్యలు లేవని స్పష్టంగా చెప్పగలను. వామపక్ష పార్టీ పాలిత కేరళ, మమతా దీదీ నేతృత్వంలోని బెంగాల్‌, నవీన్‌ పట్నాయక్‌ సారథ్యంలోని ఒడిశా, జగన్‌ మోహన్‌ రెడ్డి సార్థథ్యంలోని ఆంధ్రప్రదేశ్‌, కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణలోనూ మేము పని చేస్తున్నాం. మోదీ జీ నుంచి ఎలాంటి వ్యక్తిగత సాయం అందదని చెప్పాలనుకుంటున్నా. జాతీయ ప్రయోజనాల దృష్ట్యా ఆయనతో పాలసీల గురించి మాట్లాడొచ్చు. కానీ ఆ పాలసీ రూపొందిన తర్వాత అది అందరి కోసం. కేవలం అదానీ గ్రూప్‌ కోసం కాదు. ’

- గౌతమ్‌ అదానీ, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌

తమ బహుళ బిలియన్‌ డాలర్ల సంస్థ భారీగా పరపతి సాధించడంపై అపోహలు ఉన్నాయని, అది బ్యాంకులు, సాధారణ ప్రజల పొదుపు సొమ్ముకు హాని కలిగిస్తుందని స్పష్టం చేశారు అదానీ. గడిచిన 7-8 ఏళ్లలో ఆదాయం 24 శాతం పెరిగిందన్నారు. అదే సమయంలో రుణాలు 11 శాతం పెరిగినట్లు స్పష్టం చేశారు.  తనపై ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ పదే పదే క్రోనీ క్యాపిటలిజం ఆరోపణలు చేయడం రాజకీయ వ్యాపారంలో భాగమని తాను నమ్ముతున్నాని చెప్పారు. రాహుల్‌ గాంధీ పార్టీ పాలించే రాజస్థాన్‌లోనూ తమకు వ్యాపారాలు ఉన్నాయని గుర్తు చేశారు. ఇటీవలే రాజస్థాన్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు తాము హాజరయ్యానని తెలిపారు. అప్పుడు తమ వ్యాపారాలను రాహుల్‌ గాంధీ ప్రశంసించినట్లు చెప్పారు. రాహుల్‌ పాలసీలు అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు. రాజస్థాన్‌లో రూ.68వేల కోట్లు పెట్టుబడులు పెట్టామన్నారు.

‘నా జీవితంలో మూడు పెద్ద బ్రేక్‌లు వచ్చాయి. తొలుత 1985లో రాజీవ్‌ గాంధీ పాలన సమయంలో ఎక్జిమ్‌ పాలసీ ద్వారా మా సంస్థ గ్లోబల్‌ ట్రేడింగ్‌ హౌస్‌గా మారింది. రెండోది, 1991లో పీవీ నరసింహారావు, డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణల ద్వారా మేము పబ్లిక్‌-ప్రైవేటు పార్ట్నర్‌షిప్‌ విధానంలోకి వచ్చాం. మూడోది నరేంద్ర మోదీ గుజరాత్‌లో 12 ఏళ్ల పాలనలో జరిగింది. ఇది మంచి అనుభవమని చెప్పగలను. గుజరాత్‌ అనేది వ్యాపార అనుకూల రాష్ట్రం, కానీ అదానీకి కాదు. ’అని తెలిపారు. 

ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement