Government Revives Armed Vigilante Groups In Jammu Kashmir Rajouri - Sakshi
Sakshi News home page

రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. గ్రామ రక్షణ కమిటీల పునరుద్ధరణ

Published Sun, Jan 8 2023 8:02 AM | Last Updated on Sun, Jan 8 2023 10:05 AM

Government Revives Armed Vigilante Groups In Jammu Kashmir Rajouri - Sakshi

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీలో కొద్ది రోజులుగా హిందువులే లక్ష్యంగా దాడులు పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస‍్తోంది. ఇటీవలే ఇళ్లల్లోకి చొరబడి మరీ ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసింది. భద్రతాపరంగా అధికార యంత్రాంగం వైఫల్యం చెందుతోందని స్థానికులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో కేంద్రం కీలక అడుగు వేసింది. ఇప్పటికే భారీగా పారామిలిటరీ బలగాలను మోహరిస్తుండగా.. తాజాగా గ్రామ పరిరక్షణ బలగాలను పునరుద్ధరిస్తోంది. వారికి ప్రభుత్వమే ఆయుధాలు అందించి గ్రామాల్లో నిఘా వేసేందుకు ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే జిల్లాలో 5,000 మంది స్థానికులు ఆయుధాల కోసం పోలీసుల వద్ద రిజిస్టర్‌ చేసుకున్నారు. 

గ్రామ రక్షణ గ్రూప్స్‌ లేదా వీడీజీగా ఈ నిఘా బలగాలను పిలుస్తారు. గడిచిన రెండు దశాబాద్దాల్లో భారీస్థాయిలో గ్రామ రక్షణ గ్రూప్స్‌ లేదా కమిటీలను పునరుద్ధరించడం ఇదే తొలిసారి. ఈ గ్రూపుల్లోని ప్రతిఒక్కరికి .303 రైఫిల్‌, 100 రౌండ్ల తూటాలు అందిస్తారు. అలాగే వారికి ఎస్‌ఎల్‌ఆర్‌ రైఫిల్స్‌ కూడా అందించాలని ప్రభుత్వం  భవిస్తోంది. 

ఏమిటీ ఈ గ్రామ రక్షణ కమిటీలు?
జమ్మూకశ్మీర్‌లో శాంతిభద్రత పరిరక్షణ పూర్తిగా దెబ్బతిన్న క్రమంలో సుమారు 30 ఏళ్ల క్రితం ఈ కమిటీలు ఏర్పాటయ్యాయి. 1990లో దోడా జిల్లాలో మైనారిటీలపై దాడులు జరిగిన క్రమంలో తొలిసారి వీడీసీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ, ఇతర జిల్లాల ప్రజలకు ఆయుధాలు అందించారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 28000 మంది వీడీసీ సభ్యులు ఉన్నారు. ఇందులో ప్రధానంగా హిందూ, సిక్కు, ముస్లిం వర్గాలకు చెందినవారు ఉన్నారు.  అయితే, సాధారణ ప్రజలను రక్షించే బాధ్యతను విస్మరించి, అటువంటి బృందాలకు ఆయుధాలు అందించిన ప్రభుత్వంపై విమర్శలు ఎదురయ్యాయి. ఆ తర్వాత పోలీసు బలగాల ప్రాబల్యం పెరిగిన క్రమంలో ఈ కమిటీల ఉనికి తగ్గిపోయింది. కానీ, ఇటీవలే హిందువులపై ఉగ్రదాడి తర్వాత గ్రామ రక్షణ కమిటీలు తిరిగి పురుడుపోసుకున్నాయి. 

రాజౌరీ జిల్లాలోని పంచాయతీల్లో ఆయుధాలను తనిఖీ చేసి గ్రామస్థులకు శిక్షణ ఇస్తోంది పోలీసు శాఖ. చాలా కాలం క్రితం కుటుంబంలోని పెద్దలకు, తల్లిదండ్రులకు అందించిన ఆయుధాలను యువకులు చేతబడుతున్నారు. ‘రైఫిల్‌ను శుభ్రం చేసుకునేందుకు నేను ఇక్కడికి వచ్చాను. దీనిని తనిఖీ చేయిస్తున్నా. మాపై ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు వారిని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నా.’ అని టింకూ రైనా అనే ఓ యువకుడు తెలిపారు. తాను పోలీసు రికార్డుల్లో పేరు నమోదు చేసుకోలేదని, కానీ తన వద్ద .303 రైఫిల్‌ ఉన్నట్లు చెప్పుకొచ్చారు.  జోగిందర్‌ సింగ్‌ అనే మరో యువకుడు తన ఇంట్లో వారికి చెందిన రెండు రైఫిల్స్‌ను ఆయుధాల తనిఖీ కేంద్రానికి తీసుకొచ్చారు. తాను వీడీసీ బృందంలో సభ్యుడిగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. 

కొత్త ఆయుధాల అందజేత..
వీడీసీ గ్రూప్‌ సభ్యులకు కొత్త ఆయుధాలు అందిస్తున్నట్లు చెప్పారు జిల్లా పోలీస్‌ చీఫ్‌ మొహమ్మద్‌ అస్లాం. ఫైరింగ్‌పై శిక్షణ ఇస్తున్నామని, ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌ కొనసాగుతోందన్నారు. మరోవైపు.. వీడీసీ సభ్యులకు రూ.4000 గౌరవవేతనం ఇస్తామని గత ఏడాది ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఇంత వరకు అమలులోకి రాలేదు. కొన్ని ప్రాంతాల్లో వీడీసీలకు అందిస్తున్న ఆయుధాలు దుర్వినియోగానికి గురవుతున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి. సుమారు 200లకు పైగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: రాజౌరీ: హిందువులే లక్ష్యంగా దాడులు.. కేంద్రం కీలక నిర్ణయం.. రంగంలోకి భారీగా పారామిలిటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement