గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి | Sakshi
Sakshi News home page

Garhmukteshwar: గఢ్‌ముక్తేశ్వర్‌లో కార్తీక పూర్ణిమ సందడి

Published Sat, Nov 25 2023 8:28 AM

Garhmukteshwar Kartik Mela Police Personnel Deployed - Sakshi

ఉత్తరప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గఢ్‌ముక్తేశ్వర్‌ భక్తులతో కిటకిటలాడుతోంది. ఇక్కడ నిర్వహిస్తున్న కార్తీక పూర్ణిమ మేళాకు లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు.  ఓ వైపు ఘంటానినాదాలు, మరోవైపు మేళతాళాలు భక్తులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. గంగానది ఒడ్డున అలంకరించిన దీపాలు దేదీప్యమానంగా వెలుగొందుతున్నాయి.

గఢ్‌ముక్తేశ్వర్‌లోని గంగా  ఘాట్‌లు భక్తుల కీర్తనలతో మారుమోగుతున్నాయి. మహాభారత కాలం నుంచి కార్తీక మాసంలో ఇక్కడి గంగానది ఒడ్డున జాతర జరుగుతూ వస్తోందని స్థానికులు చెబుతున్నారు. ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల నుండి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ప్రధాన స్నానం నవంబర్ 26,27 తేదీలలో జరగనుంది. దీంతో భక్తుల రద్దీ మొదలైంది. భక్తుల రాకతో పుణ్యక్షేత్రం కిటకిటలాడుతోంది. ఇక్కడికి వచ్చే భక్తులంతా గంగామాతకు హారతులు ఇస్తున్నారు. గంగా ఘాట్‌లపై యువతులు అందమైన ముగ్గులు వేస్తున్నారు.

హాపూర్ ఎస్పీ అభిషేక్ వర్మ మాట్లాడుతూ ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన ఈ మేళా నవంబర్ 29 వరకు కొనసాగుతుందని తెలిపారు. ఇక్కడ ప్రధాన స్నానం నవంబర్ 26, 27 తేదీలలో జరుగుతుందని, దాదాపు 35 నుంచి 40 లక్షల మంది భక్తులు వస్తారనే అంచనా వేస్తున్నామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు చెందిన 2200 మంది పోలీసులు గంగామేళాలో విధులు నిర్వహిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: సొరంగం పైనుంచి రెస్క్యూ ఆపరేషన్‌?

Advertisement
 
Advertisement
 
Advertisement