ఉచిత వ్యాక్సిన్‌ హామీ కోడ్‌ ఉల్లంఘన కాదు

Free COVID-19 vaccine promise not violation of poll code - Sakshi

ఎన్నికల కమిషన్‌

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామంటూ బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ తన మేనిఫెస్టోలో హామీ ఇవ్వడం ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కాదని కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. ఉచిత వ్యాక్సిన్‌ వాగ్దానం వివక్షా పూరితమైనదనీ, కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆర్టీఐ కార్యకర్త సాకేత్‌ గోఖలే ఇచ్చిన ఫిర్యాదుపై స్పందిస్తూ ఎన్నికల కమిషన్‌ ఇది ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కిందకు రాదని తేల్చింది. పౌరుల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వివిధ సంక్షేమ పథకాలను చేపట్టవచ్చునని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు చెపుతున్నాయి. ఎన్నికల ప్రణాళికలో ప్రజాసంక్షేమం కోసం ఇలాంటి  వాగ్దానాలు చేయడంలో అభ్యంతరం ఉండదని ఈసీ పేర్కొంది.

ఆచరణాత్మకమైన వాగ్దానాలు ఎన్నికల ప్రణాళికలో చేర్చడం ద్వారా ప్రజల విశ్వాసాన్ని చూరగొనడంలో తప్పు లేదని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రణాళికలను రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్దిష్ట ఎన్నికల సందర్భాల్లో విడుదల చేస్తుంటారని ఈసీ తెలిపింది. అయితే బీజేపీ ఎన్నికల ప్రణాళికలో ఉచిత వ్యాక్సిన్‌ వాగ్దానాన్ని ఒక్క బిహార్‌ రాష్ట్ర ప్రజలకే ఇస్తానని పేర్కొందని, ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌ విస్మరించడం ఆశ్చర్యంగా ఉందని గోఖలే వ్యాఖ్యానించారు. బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించాయి. ఇదివరకే బీజేపీ మేనిఫెస్టోని కేంద్ర మంత్రి నిర్మల  విడుదల చేశారు. వ్యాక్సిన్‌ని బిహార్‌ ప్రజలకు ఉచితంగా అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యం రాష్ట్ర జాబితాలో ఉన్న విషయమని, ఇది కేవలం బిహార్‌కే పరిమితమని, దేశం మొత్తానికి వర్తించదని బీజేపీ తెలిపింది.

ప్రధాని బయోపిక్‌ విడుదల ఉల్లంఘన కాదు
బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయోపిక్‌ను విడుదల చేయడం నిబంధనావళి ఉల్లంఘనగా పరిగణించలేమని ఎన్నికల సంఘం(ఈసీ) స్పష్టం చేసింది. ఎన్నికల సమయంలో ఈ సినిమాను విడుదల చేయడం ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సెప్టెంబర్‌ 25వ తేదీన ప్రకటించగా బయోపిక్‌ను అక్టోబర్‌ 15వ తేదీన విడుదల చేశారని అందులో పేర్కొన్నారు. దీనిపై ఈసీ స్పందిస్తూ ఈ సినిమా గత ఏడాది మేలోనే రిలీజ్‌ అయినందున ఉల్లంఘన కిందకు రాదంటూ స్పష్టత ఇచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top