Karnataka: యడ్డీ రాజీనామాతో ఆగిన గుండె.. విషాదంలో మాజీ సీఎం

Fan Life Ends BS Yediyurappa Expressd Shock - Sakshi

బెంగళూరు: తమ అభిమాన నేత ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంతో అతడు తల్లడిల్లిపోయాడు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారనే వార్త విన్న ఆ యువకుడు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తెలిసి అపద్ధర్మ ముఖ్యమంత్రి దిగ్ర్భాంతికి గురయ్యారు. ఈ ఘటన తనకు షాక్‌కు గురి చేసిందని తెలిపారు. ఆ కుటుంబంలో అతడి లోటును ఏమిచ్చినా పూడ్చలేమని తెలిపారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కర్ణాటకలో కొన్ని నెలలుగా సాగుతున్న పొలిటికల్‌ సస్పెన్స్‌కు సోమవారం తెరపడింది. కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి ఎట్టకేలకు బీఎస్‌ యడియూరప్ప సోమవారం రాజీనామా చేశారు. పార్టీలో ఏర్పడ్డ విబేధాల కారణంగా.. అసమ్మతి వర్గం వైపు అధిష్టానం మొగ్గు చూపడంతో రెండేళ్లకే ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన దిగిపోయారు. యడియూరప్ప రాజీనామాతో చామరాజనగర జిల్లాకు చెందిన రవి (35) మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న యడియూరప్ప షాక్‌కు గురయ్యినట్లు ట్వీట్‌ చేశారు.

‘నా రాజీనామాతో మనస్తాపం చెంది రవి ఆత్మహత్యకు పాల్పడడం బాధ కలిగింది. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఇది జీవితంలో అంగీకరించలేని వాస్తవం. అతడిని కోల్పోవడంతో ఆ కుటుంబం పడుతున్న బాధ అంతాఇంతా కాదు’ అని యడియూరప్ప ట్వీట్‌ చేశారు. త్వరలోనే మృతుడి కుటుంబాన్ని ఆయన పరామర్శించే అవకాశం ఉంది. కాగా, రవి ఆత్మహత్యపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సీఎం రాజీనామాతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడా, లేదా అనే అంశంపై కూడా దర్యాప్తు చేయనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top