పీరియడ్స్‌ టైంలో మహిళలు వ్యాక్సిన్‌ తీసుకోవచ్చా?

Fact check Covid Vaccine affects your period cannot be taken during your period - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: రెండో దశలో కరోనామహమ్మారి విజృంభిస్తోంది. మరోవైపు కరోనా అంతానికి దేశవ్యాప్తంగా వివిధ దశల్లో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ అమలవుతోంది. ఈ క్రమంలో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ అందించనున్నారు. ఇప్పటికే, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణా సహా పలు రాష్ట్రాలు ఉచితంగా టీకాను అందిస్తామని ప్రకటించాయి. అయితే అనవసరమైన అపోహలు,  భయాలు మధ్య చాలామంది వ్యాక్సిన్‌ తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. తాజాగా మహిళల వ్యాక్సినేషన్‌కు సంబంధించి మరో రూమర్‌ హల్‌చల్‌ చేస్తోంది. అదేమిటంటే.. పీరియడ్‌ (బహిష్టు)కు ముందు ఐదు రోజులు  ఆ తరువాత ఐదు రోజులు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోకూడదంటూ ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. అయితే ఇది ఎంత మాత్రం నిజంకాదని గాయని చిన్మయి శ్రీపాద్‌ సోషల్‌ మీడియా ద్వారా వివరణ ఇచ్చారు. సోషల్‌ మీడియాలో చురుకుగా ఉండే ఆమె ఈ విషయంలో ప్రముఖ గైనకాలజిస్ట్‌, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంజుల అనగాని ద్వారా ధృవీకరించుకున్నానని స్పష్టం చేశారు. దయచేసి ఇలాంటి ఫేక్‌ న్యూస్‌ను ప్రచారం చేయొద్దంటూ వేడుకున్నారు. అటు పీఐబీ ఫ్యాక్ట్‌ చెక్‌​ కూడా ఈ వార్తలను ఫేక్‌ అని తేల్చి పారేసింది.  ఈ పుకార్లను  నమ్మొద్దని మహిళలకు విజ్ఞప్తి చేసింది.

కరోనా వ్యాక్సిన్‌ రుతుచక్ర మార్పులకు కారణమవుతుంది అనేందుకు సాక్ష్యాలు లేవు. ఎలాంటి భయాలు లేకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని నిపుణులంటున్నారు. టీకా తీసుకున్నతరువాత తమకెలాంటి సమస్యలు లేవని పలువురు డాక్టర్లతోపాటు, మరి కొంతమంది తమ అనుభవాలను చెబుతున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న తరువాత పీరియడ్‌ సైకిల్‌లో తేడాలున్నాయనడానికి ఎటువంటి ఆధారాలు లేవనీ, అలాగే ఒకసారి పీరియడ్‌లో మార్పు వస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. అటు గర్భవతిగా ఉన్నవారికి సురక్షితమని సీడీసీ పేర్కొంది.

అయితే ఇన్‌పైడర్‌ కథనం ప్రకారం రుతు చక్రాలు, వ్యాక్సీన్లకు సంబంధించిన డేటా లేకపోవడంపై ప్రముఖ గైనకాలజిస్ట్‌ డాక్టర్ జెన్ గుంటర్  అసహనం వ్యక్తం చేశారు. వివిధ రకాల వ్యాక్సిన్లు.. వంధ్యత్వం,  పునరావృత గర్భస్రావాలకు సంబంధిత ప్రభావాల గురించి అధ్యయనాలు ఉన్నాయి కానీ, దీనిపై లేవన్నారు. అయితే వ్యాక్సిన్‌ తరువాత వచ్చే ఫీవర్‌ గురించి తెలుసుకోవడం ఎంత ముఖ్యమో  పీరియడ్‌ సమస్యల గురించి కూడా తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యమని ఆమె అన్నారు. అలాగే కోవిడ్‌​-19 వ్యాక్సిన్‌కు పీరియడ్స్‌ సమస్యలకు సంబంధం లేదని కొంతమంది పరిశోధకులు తేల్చి చెప్పారు. క్లినికల్‌ పరీక్షల సందర్బంగా ఇలాంటి సమస్యలేవీ తమ దృష్టికి రాలేదని  వెల్లడించారు. 

మరోవైపు టీకా తర్వాత మార్పులను అనుభవించిన ఇద్దరు మహిళా పరిశోధకులు కరోనా వ్యాక్సిన్లు- పీరియడ్లపై ఎలా ప్రభావితం చేస్తాయో పరిశీలిస్తున్నారు. ప్రభావితమైన వారి సంఖ్య గురించి సర్వే  తమకేమీ చెప్పలేదని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్‌ స్కాలర్‌ కాథరిన్ లీ చెప్పారు. సాధారణంగా రుతుస్రావం అనేది ఒత్తిడికి సంబంధించినదై ఉంటుంది కాబట్టి. దీనికి ఒత్తిడి కారణం కావచ్చని, శాన్ డియాగోలోని ప్రముఖ స్త్రీవైద్య నిపుణురాలు డాక్టర్ కెల్లీ కల్వెల్ చెప్పారు. వ్యాక్సిన్‌ తరువాత యాంటీ బాడీస్‌ ఉత్పత్తి అయ్యేందుకు కొంత ఒత్తిడి ఏర్పడుతుందని బహుశా ఇదే సమస్యకు కారణం కావచ్చన్నారు. వ్యాక్సిన్‌ తరువాత శరీరంలో రోగనిరోధక వ్యవ‍స్థ  ప్రతిస్పందన, ఎండోమెట్రియం, రుతుస్రావం సమయంలో మందంగా ఉండే గర్భాశయం లైనింగ్‌పై ప్రభావంతో ఈ సమస్యలు ఏర్పడి ఉంటాయా అనే సందేహాన్నిఆమె వ్యక్తం చేశారు. ఈ సమస్యల ఇతర వ్యాక్సిన్లలో కూడా ఉండి ఉండవచ్చని, అయితే కరోనాకు సంబంధించి ఇప్పటివరకు మాస్‌ వ్యాక్సినేషన్‌ జరగలేదు. అందుకే సోషల్‌ మీడియాలో ఇపుడువస్తున్నంత విరివిగా ప్రశ్నలు ఉత్పన్నం కాలేదనీ, దీనిపై మరింత పరిశోధన జరగాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. 

రుతుక్రమ సమస్యలను పూర్తిగా కొట్టిపారేసే అధికారిక పరిశోధనలు ఏవీ ప్రస్తుతానికి అందుబాటులో లేవని మరికొంతమంది వాదిస్తున్నారు. టీకా తీసుకున్న తరువాత 5 రోజుల ముందుగానే తనకు పీరియడ్‌ వచ్చిందని, బ్లీడింగ్‌ ఎక్కువగా ఉందని బోస్టన్‌లో 24 ఏళ్ల సామ్ (పేరు మార్చాం) ఫిర్యాదు చేశారు. అలాగే ఎనిమిదేళ్ల క్రితమే మెనోపాజ్ వచ్చిన తనకు  వ్యాక్సిన్‌ తీసుకున్న మూడువారాల తరువాత తనకు మళ్లీ బ్లీడింగ్‌ అవుతోందని మరో ట్విటర్‌ యూజర్‌ తన అనుభవాన్ని షేర్‌ చేశారు. ఫైజర్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ తీసుకున్న మరో మహిళది కూడా దాదాపు ఇలాంటి అనుభవమే. వెన్నునొప్పి, దాదాపు పురిటి నొప్పుల్లాంటి ఫీలింగ్‌ కలిగిందని  చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top