కరోనా బాధితులకు గ్యాంగ్రీన్‌ ముప్పు!

Experts Warns That Covid-19 Complications Can Lead To Gangrene Risk - Sakshi

గుజరాత్‌లో వెలుగు చూస్తున్న కేసులు

జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు 

అహ్మదాబాద్‌: ప్రాణాంతక కరోనాను జయించామనే ఆనందం లేకుండా చేస్తున్నాయి బ్లాక్‌ఫంగస్‌, వైట్‌ఫంగస్‌ వ్యాధులు. ఫంగస్‌ వ్యాధులతోనే సతమతం అవుతుంటే ఇప్పుడు వీటికి గ్యాంగ్రీన్‌ జతవుతోంది. కోవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాంగ్రీన్‌ లక్షణాలు కనిపిస్తున్నాయంటున్నారు వైద్యులు. పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత శరీరంలో వచ్చే మార్పులను జాగ్రత్తగా గమనించాలని లేదంటే గ్యాంగ్రీన్‌, గుండెపోటు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

గ్యాంగ్రీన్‌ 
కోవిడ్‌ బారిన పడిన వ్యక్తుల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటోంది. దీంతో రకరకాల అనారోగ్య సమస్యలు వారిన్ని వెన్నాడుతున్నాయి. ఇందులో చాలా మందిలో రక్తం చిక్కబడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు గుర్తించారు. అయితే చిక్కబడుతున్న రక్తాన్ని శరీరం తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తుంది. అయితే ఈ ప్రక్రియ పదేపదే జరగడం వల్ల కొందరిలో రక్తం గడ్డ కట్టుకుపోయి త్రోంబోసిస్‌కి దారి తీస్తోందంటున్నారు డాక్టర్లు.

అయితే ఈ రక్తపు గడ్డలు శరీరంలో ఎక్కడైతే  రక్త ప్రసరణకు అతిగా అడ్డుపడతాయో క్రమంగా ఆ భాగంలో ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తున్నాయి. ముఖ్యంగా కాళ్లు, చేతుల్లో రక్తపు గడ్డలు ఏర్పడినప్పుడు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో నిర్లక్ష్యం చేస్తే అది క్రమంగా గ్యాంగ్రీన్‌కు దారి తీయవచ్చని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఈ తరహా కేసులు గుజరాత్‌లో వెలుగు చూస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు.

నిర్లక్ష్యం వద్దు
కాళ్లు , చేతుల్లో రక్తపు గడ్డలు ఏ‍ర్పడి మొద్దుబారిపోయి బరువుగా ఉన్నట్టు అనిపిస్తే వెంటనే వైద్య చికిత్స చేయించుకోవాలంటున్నారు. లేదంటే కొద్ది రోజుల్లోనే ఆ గడ్డలు ఎరుపు లేదా నీలం రంగులోకి మారిపోతాయని చెబుతున్నారు. ఇక రక్తపు గడ్డలు గుండె లేదా మెదడులో ఏర్పడి రక్త ప్రసరణకు అడ్డుపడితే ఆరు గంటల్లోగా వైద్య సాయం అందించాల్సి ఉంటుందని లేదంటే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు వైద్యులు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top