ఎన్నికల బాండ్ల విక్రయానికి ఓకే చెప్పిన సుప్రీం

Electoral bonds can be issued ahead of assembly polls - Sakshi

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల బాండ్ల విక్రయంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఎన్నికల బాండ్ల విక్రయానికి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్న, వి. రామసుబ్రమణియన్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం అనుమతి మంజూరు చేసింది. 2018 నుంచి ఎన్నికల బాండ్ల విక్రయం నిరాటంకంగా జరుగుతోందని, ఇప్పుడు వీటిపై స్టే విధించడానికి తగిన కారణాలేవీ కనిపించడం లేదని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది.

పశ్చిమబెంగాల్‌ సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త ఎన్నికల బాండ్లను విక్రయిస్తే షెల్‌ కంపెనీలు పుట్టుకొచ్చి రాజకీయ పార్టీలకు అక్రమ మార్గాల్లో నిధులు సమకూరుతాయని  అందుకే ఈ బాండ్ల విక్రయాలపై స్టే ఇవ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రాటిక్‌ రిఫామ్స్‌ (ఎడిఆర్‌) తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ఎన్నికల బాండ్ల కొనుగోలు సంస్థల పేర్లు గోప్యంగా ఉంచడం వల్ల విదేశీ కంపెనీల నుంచి నిధులు పెద్ద ఎత్తున వచ్చి అవి దుర్వినియోగమవుతున్నాయని, ఆ అకౌంట్లలో పారదర్శకత కనిపించడం లేదని ఎడిఆర్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

అయితే దీనిపై , కేంద్ర ప్రభుత్వం వాదన మరోలా ఉంది. ఎన్నికల సంఘం అనుమతి తీసుకొనే ఏప్రిల్‌ 1 నుంచి 10 వరకు ఎన్నికల బాండ్ల విక్రయం చేపడుతున్నామని అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ సుప్రీం కోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల చెల్లుబాటు 15 రోజుల వరకు మాత్రమే ఉంటుందని, రాజకీయ పార్టీలు ఈ నిధులపై ఆదాయ పన్ను కూడా కట్టాలని అలాంటప్పుడు అక్రమ మార్గాల్లో నగదు వచ్చే అవకాశమే లేదని కేంద్రం పేర్కొంది. ఎన్నికల సంఘం       కూడా బాండ్ల విక్రయానికి మద్దతు తెలపడంతో సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top