Mallikarjun Kharge: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గేకు బిగ్‌ షాక్‌

ED Questions Congress Senior Leader Mallikarjun Kharge - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: నేషనల్‌ హెరాల్డ్‌ పత్రిక అవినీతి కేసులో మరో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకు షాక్‌ తగిలింది. ఈ కేసులో భాగంగా రాజ్యసభలో విపక్షనేత మల్లికార్జున ఖార్గేకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) నోటీసులు పంపించింది. సోమవారం విచారణకు హాజరు కావాలని సూచించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని ఈడీ ఆఫీసుకు వచ్చిన ఖర్గేను అధికారులు ప్రశ్నిస్తున్నారు. విచారణలో పలు అంశాలపై స్పష్టత కోసం ఆయనను పిలిచినట్లు వెల్లడించారు. మనీల్యాండరింగ్‌ నిరోధక చట్టం ప్రకారం ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్టు ఈడీ అధికారులు తెలిపారు. 

ఇదిలా ఉండగా.. అగస్టా వెస్ట్‌లాండ్‌ చాపర్‌ కుంభకోణం కేసులో రక్షణ శాఖ మాజీ కార్యదర్శి, మాజీ కాగ్‌ శశికాంత్‌ శర్మకు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు రిటైర్డ్‌ అధికారులతో పాటు అంతకుముందు సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో ఉన్న నిందితులందరికీ ప్రత్యేక న్యాయస్థానం సమన్లు పంపింది. వీరంతా ఏప్రిల్‌ 28వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 

అయితే, 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలులో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ కంపెనీకి అనుకూలంగా పనిచేసేందుకు అవినీతికి పాల్పడ్డారన్న వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేపట్టింది. కాగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఈ ఒప్పందం చేసుకోగా.. ఎన్​డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఒప్పందాన్ని రద్దు చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top