Sanjay Raut Arrest: సంజయ్‌ రౌత్‌కు వ్యతిరేకంగా పక్కా ఆధారాలున్నాయ్‌: ఈడీ

ED Arrest Sanjay Raut: Arrest Memo Reveal Reasons - Sakshi

ముంబై: శివ సేన ఎంపీ, ఆ పార్టీ కీలక నేత సంజయ్‌ రౌత్‌ను మనీలాండరింగ్‌ కేసులో ఈడీ అరెస్ట్‌ చేసింది. ఈ వ్యవహారంపై మహా రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగానూ చర్చ నడుస్తోంది. రౌత్‌కు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షల అనంతరం చివరికి సోమవారం మధ్యాహ్నాం రిమాండ్‌ కోరుతూ స్పెషల్‌ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ.

అయితే ఆయన అరెస్టుకు సంబంధించిన కీలక విషయాలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. పలు జాతీయ మీడియా చానెల్స్‌ ఆయన అరెస్ట్‌ మెమో కాపీ వివరాలను సేకరించాయి. వాటిలో ఏముందంటే.. 

సంజయ్‌ రౌత్‌ ‘పాత్రా చావల్‌’ వెయ్యి కోట్ల రూపాయల భూకుంభ కోణంలో భాగం అయ్యారని, ఆయన మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు తమ దగ్గర పక్కా ఆధారాలు ఉన్నట్లు అరెస్ట్‌ మెమోలో స్పష్టం చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌. భార్య వర్ష రౌత్‌ ఆస్తులకు సంబంధించిన వివరాలతో పాటు వ్యాపారవేత్త ప్రవీణ్‌ రౌత్‌, స్వప్న పాట్కర్‌(ప్రవీణ్‌ రౌత్‌ భార్య)లతో సంబంధాలు, వ్యాపార లావాదేవీల గురించి సంజయ్‌ రౌత్‌పై ఈడీ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించారు. 

‘‘నా వద్ద ఉన్న మెటీరియల్ ఆధారంగా.. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీల్యాండరింగ్‌ యాక్ట్‌ నిబంధనల ప్రకారం శిక్షార్హమైన నేరానికి సంజయ్ రాజారామ్ రౌత్ పాల్పడినట్లు నమ్ముతున్నాం. అందుకే ఆయన్ని అరెస్ట్‌ చేశాం’’ అని దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. ప్రివెన్షన్‌ ఆఫ్‌ మనీ ల్యాండరింగ్‌ యాక్ట్‌ సెక్షన్‌ 19 సబ్‌ సెక్షన్‌ (1) ప్రకారం ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు అరెస్ట్‌ మెమోలో పేర్కొనబడింది. అంతేకాదు రౌత్‌ను అరెస్ట్‌ చేసే ముందు.. కారణాలను సైతం అధికారులు ఆయనకి వివరించారు. 

సంజయ్‌ రౌత్‌ విచారణ సమయంలో సహకరించలేదు. అలాగే.. లావాదేవీ వివరాల ఆధారంగా మనీల్యాండరింగ్‌తో లాభపడింది సంజయ్ రౌత్ అని, తద్వారా ఆయన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నాయి.  అంతేకాదు.. సంజయ్‌ రౌత్‌, ఈ వ్యవహారంలో ప్రథమ నేరస్తుడిగా ఉన్న ప్రవీణ్‌ రౌత్‌కు సహకరించారు. ఇలా మూడు కారణాలతో ఆయన్ని అరెస్ట్‌ చేసినట్లు అరెస్ట్‌ మెమో వివరించింది.

ఇక ఆదివారం సంజయ్‌ రౌత్‌ ఇంట్లో జరిగిన సోదాల్లో రూ.11.50 లక్షల లెక్కల్లోలేని సొమ్మును సీజ్‌ చేసింది. ఆపై ఆరుగంటలకు పైగా ఆయన్ని ప్రశ్నించి.. ఆపైనే అరెస్ట్‌చేసి ఈడీ కార్యాలయానికి తరలించింది. ఈడీ కార్యాలయానికి తన కారులోనే వెళ్లిన సంజయ్‌ రౌత్‌.. అంతుకు ముంద తన తల్లిని హత్తుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించి.. అనంతరం పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టింది ఈడీ.  

గతంలో..

ముంబైలోని ‘పాత్రా చావల్‌’ఏరియాలో పునరాభివృద్ధి ప్రాజెక్టులో అవకతవకలతో జరిగిన భూ కుంభకోణం విలువ రూ. 1,034 కోట్లుగా అంచనాకు వచ్చింది ఈడీ. గతంలో ఆరోపణల మేరకు దర్యాప్తు జరుగుతుండగా.. సంజయ్‌ రౌత్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన రూ.11.15 కోట్లకు పైగా విలువైన ఆస్తుల్ని అటాచ్‌ చేసింది. ఆపై ఈడీ ఎదుట విచారణకు సైతం హాజరయ్యారు సంజయ్‌ రౌత్‌.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top