ముంబై: మహారాష్ట్రలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎన్సీపీ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్(66) విమానం ప్రమాదంలో కన్నుమూశారు. బారామతిలో ల్యాండింగ్ సమయంలో ఆయన ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా కుప్పకూలి పేలిపోయింది. ఈ ఘటనలో అజిత్ పవార్‌తో పాటు ఉన్న ఐదుగురూ మరణించినట్లు సివిల్ ఏవియేషన్ నియంత్రణ సంస్థ డీజీసీఏ అధికారికంగా ప్రకటించింది.
బుధవారం ఉదయం తన నియోజకవర్గం బారామతిలో జరగాల్సిన బహిరంగ సభలో అజిత్ పవార్ హాజరు కావాల్సి ఉంది. అయితే మరికొద్ది క్షణాల్లో విమానం ల్యాండ్ కావాల్సి ఉండగా.. అనూహ్యంగా ప్రమాదానికి గురైంది. కూలిన వెంటనే విమానం పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అందులో ఉన్నవాళ్లంతా సజీవ దహనం అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ బారామతి రీజియన్లలో ఆయన నాలుగైదు సభల్లో పాల్గొనాల్సి ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఉదయం 8.45 గంటల సమయంలో విమాన ప్రమాదం జరిగింది. ఆ సమయంలో అజిత్ పవార్‌తో పాటు ఆయన పీఏ, సెక్యూరిటీ గార్డు, ఇద్దరు పైలట్లు ఉన్నారు. మృతులను డిప్యూటీ సీఎం అజిత్ పవార్, విదీప్ జాదవ్, పింకీ మాలి, కెప్టెన్ సుమిత్ కపూర్, కెప్టెన్ శాంభవి పాఠక్‌గా తెలుస్తోంది. ప్రమాదానికి గురైన విమానం.. బంబార్డియర్ లీర్జెట్ 45(కెనడా) రకం విమానం. ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోలిపోయింది.

#UPDATE | Five people on board the Mumbai to Baramati charter plane, which crash landed, have died: DGCA (Directorate General of Civil Aviation) pic.twitter.com/ftrUPnqjZT
— ANI (@ANI) January 28, 2026
ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అజిత్ పవార్ సహా అందరి మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే అజిత్‌పవార్ భార్య సునేత్ర, సోదరి సుప్రియా సూలే హుటాహటిన బారామతికి బయల్దేరారు. అటు ఢిల్లీలో ఉన్న పవార్ కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు చేరుకుంటున్నారు.
అజిత్ పవార్ హఠాన్మరణం మహారాష్ట్ర రాజకీయాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఏక్‌నాథ్‌షిండే తదితరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు స్పందిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఫోన్ చేసి ఘటనపై ఆరా తీశారు.
నాలుగున్నర దశాబ్దాల పాటు రాజకీయాల్లో
అజిత్ పవార్ (Ajit Pawar) పూర్తి పేరు అజిత్ అనంతరావ్ పవార్. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) వ్యవస్థాపకుడు శరద్ పవార్ సోదరుడి అనంతరావ్ కుమారుడే ఈయన. స్వగ్రామం పూణే జిల్లాలోని బారామతి తాలూకాలోని కతేవాడి. 1959 జులై 22న జన్మించారీయన. పుట్టింది మాత్రం అహ్మద్ నగర్ జిల్లాలోని రాహురి తాలూకాలోని తన తాత గ్రామం డియోలాలి (ప్రవర)లో. అజిత్ పవార్ కళాశాల విద్య కోసం ముంబైవచ్చారు. ఆ తరువాత బారామతికి వచ్చి అక్కడి సహకార సంఘాల నుండి సామాజిక, రాజకీయ కార్యక్రమాలను ప్రారంభించారు.
అజిత్ పవార్ 1982లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదే సంవత్సరంలో, అతను కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల బోర్డుకు ఎన్నికయ్యాడు. 1991లో బారామతి నుంచి ఎంపీ నెగ్గిన అజిత్‌పవార్.. ఆ తర్వాత అదే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యేగా నెగ్గారు. ఎన్సీపీ తరఫున ఎమ్మెల్యేగా, మహారాష్ట్రకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.
గత మహారాష్ట్ర ఎన్నికలకు ముందు బాబాయ్ శరద్ పవార్‌తో తెగదెంపులు చేసుకుని ఎన్సీపీ వేరు వర్గంతో మహాయుతి కూటమితో జత కట్టారు. అధికారంలోకి వచ్చాక మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా.. ఆర్థిక, ప్రణాళిక, క్రీడలు, మైనారిటీ అభివృద్ధి వంటి శాఖలను నిర్వహిస్తున్నారు. మహారాష్ట్రకు అత్యధిక కాలం డిప్యూటీ సీఎంగా పని చేసిన ఘనత కూడా అజిత్ పవార్‌దే.


