పట్టుబడింది రూ.1,444 కోట్లు | ECI Briefs 1,444 Observers for Assembly Elections in 5 States | Sakshi
Sakshi News home page

పట్టుబడింది రూ.1,444 కోట్లు

May 8 2026 4:32 AM | Updated on May 8 2026 4:32 AM

ECI Briefs 1,444 Observers for Assembly Elections in 5 States

 అత్యధికంగా తమిళనాడులో రూ.662 కోట్లు  

 వివరాలను విడుదల చేసిన ఈసీఐ 

సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దమొత్తంలో సీజ్‌ చేసింది. వీటి మొత్తం విలువ రూ.1,400 కోట్లకు పైమాటేనని ఈసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 5 రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ (ఎంసీసీ) పటిష్టంగా అమలు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. 

పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా (144) అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికల నియమావళి ముగిసినట్లు వెల్లడించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన కార్యదర్శులు, సీఈఓలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలతో పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించామని వివరించింది. ఇందులో భాగంగా 376 మంది వ్యయ పరిశీలకులు, 7,470 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 7,470 స్టాటిక్‌ సరై్వలెన్స్‌ బృందా (ఎస్‌ఎస్టీ)లను మోహరించామని వెల్లడించింది. 

కీలకంగా మారిన ఐటీ వేదిక 
ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌(ఈఎస్‌ఎంఎస్‌) అనే ఐటీ వేదికను ఈసీ వినియోగంలోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపడి సమాచార మార్పిడి వేగవంతమైంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈఎస్‌ఎంఎస్‌ యాక్టివేట్‌ చేసినప్పటి నుంచి మే 6వ తేదీ వరకు పట్టుబడిన మొత్తం సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. ఈ కాలంలో పట్టుబడిన సొత్తు విలువ రూ.1444.96 కోట్లు. ఇందులో నగదు రూ.154.89 కోట్లు, మద్యం విలువ రూ.183.33 కోట్లు, డ్రగ్స్‌ రూ.337.88 కోట్లు, విలువైన లోహాలు రూ.250.14 కోట్లు, ఉచితాలు తదితరాల విలువ రూ.518.73 కోట్లుగా రికార్డయింది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా రూ.662.28 కోట్లు సీజ్‌ చేయగా, పశ్చిమ బెంగాల్‌ రూ.573.41 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అస్సాంలో రూ.117.24 కోట్లు, కేరళలో రూ.80.67 కోట్లు, పుదుచ్చేరిలో రూ.9.72 కోట్లు పట్టుబడ్డాయి.

40.14 శాతం పెరుగుదల
2021 సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.1029.93 కోట్లు. ఆ గణాంకాలతో పోలిస్తే 2026 ఎన్నికల్లో 40.14 శాతం పెరుగుదల నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో సీజ్‌ల శాతం అత్యధికంగా 68.92% పెరగ్గా, తమిళనాడులో 48.40% పెరుగుదల నమోదైందని ఎన్నికల సంఘం వివరించింది.  
 

Advertisement
 
Advertisement
Advertisement