breaking news
property seez
-
పట్టుబడింది రూ.1,444 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఉద్దేశించిన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర వస్తువులను ఎన్నికల సంఘం (ఈసీఐ) పెద్దమొత్తంలో సీజ్ చేసింది. వీటి మొత్తం విలువ రూ.1,400 కోట్లకు పైమాటేనని ఈసీఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 5 రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ) పటిష్టంగా అమలు చేసినట్లు ఎన్నికల సంఘం పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని ఫాల్టా (144) అసెంబ్లీ నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని చోట్లా ఎన్నికల నియమావళి ముగిసినట్లు వెల్లడించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రధాన కార్యదర్శులు, సీఈఓలు, డీజీపీలు, ఉన్నతాధికారులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో పలు దఫాలుగా సమీక్షా సమావేశాలు నిర్వహించామని వివరించింది. ఇందులో భాగంగా 376 మంది వ్యయ పరిశీలకులు, 7,470 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 7,470 స్టాటిక్ సరై్వలెన్స్ బృందా (ఎస్ఎస్టీ)లను మోహరించామని వెల్లడించింది. కీలకంగా మారిన ఐటీ వేదిక ఎన్నికల అక్రమాలను అరికట్టేందుకు ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్(ఈఎస్ఎంఎస్) అనే ఐటీ వేదికను ఈసీ వినియోగంలోకి తెచ్చింది. దీని ద్వారా వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం మెరుగుపడి సమాచార మార్పిడి వేగవంతమైంది. ఫిబ్రవరి 26వ తేదీన ఈఎస్ఎంఎస్ యాక్టివేట్ చేసినప్పటి నుంచి మే 6వ తేదీ వరకు పట్టుబడిన మొత్తం సొత్తు వివరాలను ఈసీ వెల్లడించింది. ఈ కాలంలో పట్టుబడిన సొత్తు విలువ రూ.1444.96 కోట్లు. ఇందులో నగదు రూ.154.89 కోట్లు, మద్యం విలువ రూ.183.33 కోట్లు, డ్రగ్స్ రూ.337.88 కోట్లు, విలువైన లోహాలు రూ.250.14 కోట్లు, ఉచితాలు తదితరాల విలువ రూ.518.73 కోట్లుగా రికార్డయింది. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో అత్యధికంగా రూ.662.28 కోట్లు సీజ్ చేయగా, పశ్చిమ బెంగాల్ రూ.573.41 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. అస్సాంలో రూ.117.24 కోట్లు, కేరళలో రూ.80.67 కోట్లు, పుదుచ్చేరిలో రూ.9.72 కోట్లు పట్టుబడ్డాయి.40.14 శాతం పెరుగుదల2021 సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పట్టుబడిన సొత్తు విలువ రూ.1029.93 కోట్లు. ఆ గణాంకాలతో పోలిస్తే 2026 ఎన్నికల్లో 40.14 శాతం పెరుగుదల నమోదైంది. పశ్చిమ బెంగాల్లో సీజ్‌ల శాతం అత్యధికంగా 68.92% పెరగ్గా, తమిళనాడులో 48.40% పెరుగుదల నమోదైందని ఎన్నికల సంఘం వివరించింది. -
అవినీతిలో ‘బ్రేక్’
ఏసీబీ వలలో డీటీసీ కార్యాలయ ఇన్స్పెక్టర్ అప్పారావు రూ.కోట్లాది విలువైన ఆస్తులు స్వాధీనం కాకినాడ రూరల్ : కాకినాడ రవాణా శాఖ (జిల్లా ట్రాన్‌పోర్ట్ కార్యాలయం) కార్యాలయం అవినీతికి అడ్డాగా మారిందనడానికి ఏసీబీ దాడులే ప్రత్యక్ష నిదర్శనంగా మారాయి. నాలుగు నెలలు తిరక్కుండానే ఏసీబీ వలలో భారీ అవినీతికి పాల్పడిన వెహికల్ ఇన్స్పెక్టర్ రావు అప్పారావు చిక్కారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం.. అప్పారావు, అతడి బంధువులు, స్నేహితుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా బంగారం, వెండి ఆభరణాలతో పాటు రూ.లక్ష నగదు, వ్యవసాయ భూముల పత్రాలు, కాకినాడ, పరిసర ప్రాంతాల్లో భవనాలు, ఖాళీ స్థలాల డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. గత మే నెలలో ఇదే కార్యాలయానికి చెందిన డీటీసీ ఆదిమూలం మోహన్ ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేసి, రూ.కోట్లాది విలువైన ఆస్తులను సీజ్ చేశారు. తాజా సంఘటనతో రవాణా శాఖాధికారి కార్యాలయ సిబ్బంది, అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. ఇలాఉంటే బుధవారం రవాణా శాఖ కార్యాలయంలో ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ రావు అప్పారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో దుర్గా విద్యుత్‌నగర్‌లోని ఆయన నివాసంతో పాటు రమణయ్యపేట, అనపర్తి, నాగమల్లితోట జంక్షన్, రమణయ్యపేటల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో ఆరు చోట్ల దాడులు నిర్వహించి, రూ.కోట్లాది ఆస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. నాగమల్లితోట జంక్షన్ సమీపంలో అప్పారావు డ్రైవర్ శ్రీనివాసరావు ఇంటిపై దాడి చేయగా, భారీగా భూముల పత్రాలు లభ్యమయ్యాయి. రామారావు స్నేహితుడైన బొడ్డు రామారావు ఇంటి నుంచి రూ.కోట్లాది విలువైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పది ఎకరాల పొలం, రమణయ్యపేట, తిమ్మాపురం, కాకినాడ, వాకలపూడి ప్రాంతాల్లో 3,500 గజాల స్థలాల డాక్యుమెంట్లు, కారు, పలు భవనాల పత్రాలు బయటపడ్డాయి. బొడ్డు రామారావు కోటేశ్వరుడైనా అతడికి తెల్లరేషన్ కార్డు, అతడి భార్య పేరిట కారు ఉందని ఏసీబీ డీఎస్పీ పి.రామచంద్రరావు తెలిపారు. వడ్డీ వ్యాపారం కూడా.. నాగమల్లితోట జంక్షన్‌లోని సత్యనారాయణ అనే మరో స్నేహితుని ఇంట్లో కూడా భారీగా ఆస్తుల పత్రాలు లభ్యమయ్యాయి. ఇతడితో రూ.కోట్లలో వడ్డీ వ్యాపారం చేస్తున్నట్టు గుర్తించారు. తుని, రౌతులపూడిల్లో భూములున్నట్టు అధికారులు కనుగొన్నారు. బొడ్డు రామారావు రూ.80 లక్షలకు పైగా వడ్డీకి ఇచ్చినట్టు ప్రామిసరీ నోట్లు, వాటి వివరాలు వెలుగుచూశాయి. బిక్కవోలు మండలం రామవరంలో రామారావు బావమరిది చిర్ల లక్ష్మణరావు ఇంట్లో సోదాలు నిర్వహించారు. గత 18 ఏళ్లుగా అప్పారావు కాకినాడ కార్యాలయంలోనే ఉండడమే కాకుండా, కానిస్టేబుల్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయికి ఎదిగారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండడంతో కేసు నమోదు చేసినట్టు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు వివరించారు. గురువారం దాడులు కొనసాగుతాయని, మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందన్నారు. బ్యాంకు లాకర్లు కూడా తెరవాల్సి ఉందన్నారు. దాడుల్లో ఏసీబీ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, సూర్యమోహనరావు, రమేష్, రామకృష్ణ, లక్మోజీ, శ్రీనివాస్, విల్సన్ పాల్గొన్నారు.


