టార్చ్‌ పోయినా..లైట్‌ హౌస్‌లా ఉంటాం.. 

EC Allots Pressure Cooker Dhinakaran, Kamal Haasan Fails Get Battery Torch - Sakshi

దినకరన్‌కు చిక్కిన ప్రెషర్‌ కుక్కర్‌

సాక్షి, చెన్నై: మక్కల్‌ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ చిహ్నం దూరమైంది. ఆ చిహ్నాని ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి దక్కింది. తమ చిహ్నం దూరం కావడంతో కమల్‌ హాసన్‌కు నిరాశ తప్పలేదు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం నేత దినకరన్‌కు ప్రెషర్‌ కుక్కర్‌ చిక్కడంతో ఆ పార్టీ వర్గాలు సంబరాల్లో మునిగారు. పార్లమెంట్‌ ఎన్నికలకు ముందుగా కమలహాసన్‌ మక్కల్‌ నీదిమయ్యం పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల్లో కొంత మేరకు ఓటు బ్యాంక్‌ను దక్కించుకున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మార్పు నినాదంతో ప్రచార ప్రయాణాన్ని సైతం మదురై నుంచి మొదలెట్టారు.

పార్లమెంట్‌ ఎన్నికల్లో తమకు కేటాయించిన టార్చ్‌లైట్‌ ను పార్టీ చిహ్నంగా మార్చేసుకుని ప్రచార పయనంలో దూసుకెళ్తున్న కమల్‌కు నిరాశ తప్పలేదు. ఎన్నికల కమిషన్‌ ఆ టార్చ్‌లైట్‌ చిహ్నంను కమల్‌కు దూరం చేసింది. ఈ చిహ్నంను ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చికి తాజాగా అప్పగించడంతో కమల్‌ వర్గానికి షాక్‌ తప్పలేదు. పుదుచ్చేరిలో మాత్రం మక్కల్‌ నీది మయ్యంకు టార్చ్‌లైట్‌ను చిహ్నంగా కేటాయించడం కాస్త ఊరట. అన్నాడీఎంకేను చీల్చి అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగంతో రాజకీయ పయనం సాగిస్తున్న శశికళ ప్రతినిధి దినకరన్‌ పంతం నెగ్గించుకున్నారు.

దక్కిన ప్రెషర్‌ కుక్కర్‌.... 
అమ్మ మరణంతో వచ్చిన ఉప ఎన్నికల్లో ఆర్కేనగర్‌ నుంచి దినకరన్‌ ప్రెషర్‌ కుక్కర్‌ చిహ్నంపై పోటీ చేసి స్వతంత్ర అభ్యర్థిగా అసెంబ్లీకి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ చిహ్నం కోసం పోరాటం చేసి కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఈసారి ముందుగానే మేల్కొన్న దినకరన్‌ ప్రెషర్‌ కుక్కర్‌ కోసం పట్టు బట్టి సొంతం చేసుకున్నారు. తమ పార్టీ చిహ్నం తమకు దక్కడంతో ఆ పార్టీ వర్గాలు మంగళవారం సంబరాల్లో మునిగారు. బాణసంచాను హోరెత్తించారు. నటుడు సీమాన్‌ నేతృత్వంలోని నామ్‌ తమిళర్‌ కట్చికి మళ్లీ రైతు చిహ్నం దక్కింది. చదవండి: ('అధికారంలోకి వస్తే మధురై రెండో రాజధాని')

టార్చ్‌ పోయినా..లైట్‌ హౌస్‌లా ఉంటాం.. 
ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌ బృందం తమ వాహనాల్లో ఉన్న టార్చ్‌లైట్‌ చిహ్నాల్ని తొలగించారు. ఇంకా తమకు ఎన్నికల కమిషన్‌ చిహ్నం కేటాయించని దృష్ట్యా, టార్చ్‌లైట్‌ దక్కించుకునేందుకు న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. టార్చ్‌లైట్‌ దూరం విషయంగా తేనిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న కమల్‌ను ప్రశ్నించగా, టార్చ్‌లైట్‌ దూరమైనా లైట్‌హౌస్‌ వలే ప్రజలకు వెలుగు నిస్తామని ధీమా వ్యక్తం చేశారు. దోపిడీదారులు నోట్లను చల్లి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

చిహ్నం విషయంగా తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. రజనీ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉందని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ప్రజలకు మంచి చేయాలన్న కాంక్షతో, అందుకు తగ్గ సిద్ధాంతాలతో వస్తే, ఆయనతో కలిసి పనిచేయడానికి సిద్ధమేనని, ఇప్పటికే ఈ విషయాన్ని తాను స్పష్టం చేసినట్టు పేర్కొన్నారు. తామిద్దరి మధ్య ఒక్క ఫోన్‌కాల్‌ చాలు అని, ప్రజల సంక్షేమం, మార్పు, మంచి కోసం ఇగోను పక్కన పెట్టి కలిసి పనిచేయడానికి సిద్ధమేనని స్పష్టం చేశారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top