‘ఒక తాలీకి మరొకటి ఉచితం’.. ప్రలోభానికిలోనైన మహిళ ఎలా మోసపోయిందంటే...

delhi woman loses rs 90000 in online cyber fraud - Sakshi

ఇటీవలి కాలంలో ఆన్‌లైన్‌ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇందుకోసం మోసగాళ్లు పలు మార్గాలను ఆశ్రయిస్తున్నారు.తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ఇటువంటి ఘరానా మోసం చోటుచేసుకుంది. ఒక మహిళ ప్రముఖ రెస్టారెంట్‌కు చెందిన యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఫుడ్‌ ఆర్డర్‌ చేసింది. ఇంతలోనే ఆమె బ్యాంకు ఖాతాలోని రూ.90 వేలు మాయమయ్యాయి. వివరాల్లోకి వెళితే మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈ ఉదంతం గత ఏడాది నవంబరు 27న చోటు చేసుకోగా, దీనిపై చాలా ఆలస్యంగా ఈ ఏడాది మే 2న సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు అందింది.

బాధితురాలి పేరు సవితా శర్మ(40)ఆమె ఒక బ్యాంకులో అధికారిగా పనిచేస్తున్నారు. ఆమె పోలీసులకు ఇచ్చిన రిపోర్గులో...తనకు గత ఏడాది తన స్నేహితురాలి నుంచి ఫోన్‌ వచ్చిందని, తరువాత ఆమె ఫేస్‌బుక్‌లోని ఒక లింకు పంపిందని తెలిపారు. ఆ అప్లికేషన్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నాక పుడ్‌కు సంబంధించిన ఒక ఆఫర్‌ తనకు అందిందన్నారు. వారు ఇచ్చిన ఫోను నంబరుకు కాల్‌ చేయగా, ఎవరూ లిఫ్ట్‌ చేయలేదన్నారు. అయితే కొద్దిసేపటి తరువాత తనకు మరో నంబరు నుంచి ఫోను వచ్చిందన్నారు. ఈ కాల్‌ చేసిన వ్యక్తి తాము సాగర్‌ రత్న రెస్టారెంట్‌ నుంచి ఫోను చేస్తున్నామని ఒక తాలీ(భోజనం) బుక్‌ చేసుకుంటే మరొక తాలీ ఉచితంగా ఇస్తామని తెలిపారు.

అయితే ఇందుకు ఒక యాప్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని చెబుతూ, దానికి సంబంధించిన యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ను ఆ వ్యక్తి తెలియజేశాడని తెలిపారు. వెంటనే ఆ మహిళ ఆ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసి యూజర్‌ నేమ్‌, పాస్‌వర్డ్‌ ఫీడ్‌ చేసింది. ఇది జరిగిన కొద్దిసేపటికి ఆమెకు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.40 వేలు విత్‌డ్రా చేసినట్లు మెసేజ్‌ వచ్చింది. రెండు సెకెన్ల తరువాత రూ. 50 వేలు డ్రా అయినట్లు మరో మెసేజ్‌ వచ్చింది. వెంటనే తాను మోసపోయానని గ్రహించి, తన క్రెడిట్‌ కార్డు బ్లాక్‌ చేయించానని బాధితురాలు తెలిపింది. కాగా బాధితురాలి నుంచి ఫిర్యాదు అందుకున్న సైబర్‌ పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. వారు సాగర్‌ రత్న రెస్టారెంట్‌ ప్రతినిధులను సంప్రదించగా, తమకు దీనిపై ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. కాగా ఇటువంటి ఆన్‌లైన్‌ వ్యవహారాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top