Delhi Liquor Scam: మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ..

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన బెయిల్ పెటిషన్‌పై విచారణను మార్చి 10కి వాయిదా వేసింది న్యాయస్థానం. అలాగే సీబీఐ కస్టడీని మరో మూడు రోజులు(మార్చి 6వరకు) పొడిగించింది.
సిసోడియాకు కోర్టు గతంలో విధించిన ఐదు రోజుల సీబీఐ కస్టడీ నేటితో ముగిసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఆయన్ను మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ ఎవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టారు అధికారులు. విచారణకు మరింత సమయం కోరగా.. న్యాయస్థానం అందుకు అంగీకరించింది.
మరోవైపు సిసోడియా అరెస్టుకు నిరసనగా ఆప్ కార్యకర్తలు ఆ పార్టీ కార్యాలయం ఎదట పెద్దఎత్తున ఆందోళనలకు దిగారు. దీంతో ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. కట్టుదిట్టమైన భద్రత నడుమ సిసోడియాను కోర్టుకు తరలించారు.
మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పైనా కోర్టులో వాదనలు జరగనున్నాయి. తనను కస్టడీలో ఉంచితే ఎలాంటి ప్రయోజనం ఉండదని, ఈ కేసుకు సంబంధించి సీబీఐ అన్నింటినీ స్వాధీనం చేసుకుందని చెప్పారు. అధికారులు ఎప్పుడు పిలిచినా వెళ్లి విచారణకు హాజరవుతానని సిసోడియా పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాను ఆదివారం 8 గంటలపాటు ప్రశ్నించిన అనంతరం సీబీఐ అరెస్టు చేసింది. ఆ తర్వాత రోజు కోర్టులో ప్రవేశపట్టి ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్న విషయం తెలిసిందే. అరెస్టు అనంతరం సిసోడియా డిప్యూటీ సీఎం, మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
చదవండి: 48 గంటల్లోనే హైవే కింద సొరంగం.. ఇది కదా మనకు కావాల్సింది.. ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్..
సంబంధిత వార్తలు