Republic Day 2023: ఢిల్లీలో ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు.. అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన

Delhi Kartavya Path 74th Republic Day Celebrations 2023 Updates - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కర్తవ్యపథ్‌లో నిర్వహించిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ప్రత్యేక అతిథి, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా పాల్గొన్నారు. సైనికులు కవాతు నిర్వహించి వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం 21 గన్‌సెల్యూట్‌తో త్రివర్ణపతాక ఆవిష్కరణ జరిగింది.

ఈ వేడుకల్లో ప్రదర్శించిన 23 శకటాలు దేశంలో భిన్న సంస్కృతిని ప్రతిబింబించాయి. 17 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు, వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించారు. ఈ ఈజిప్టు సైనికులు నిర్వహించిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దేశనలుమూల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శన ఆకట్టుకుంది.  సైనికుల సాహసాలు అబ్బురపరిచాయి.

ఆత్మనిర్బర్ భారత్..
ఆత్మనిర్బర్ భారత్‌ ప్రతిబించేలా ఈసారి వేడుకల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలనే ప్రదర్శించారు.  105 ఎంఎం ఇండియన్ ఫీల్డ్ తుపాకులు, ఇటీవలే సైన్యంలో చేరిన ఎల్‌సీహెచ్ ప్రచండ్, కే-9 వజ్ర హోవిట్జర్, ఎంబీటీ అర్జున్, నాగ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్, క్విక్ రియాక్షన్ ఫైటింగ్ వెహికిల్స్‌ను ప్రదర్శించారు. పరేడ్ అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించడంతో గణతంత్ర వేడుకలు ముగిశాయి.

11:20 AM
అబ్బురపరిచిన శకటాల ప్రదర్శన..
కర్తవ్యపథల్‌ గణతంత్ర వేడుకల్లో భాగంగా నిర్వహించిన శకటాల ప్రదర్శన అబ్బురపరిచింది. 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన శకటాలతో పాటు వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను పరేడ్‌లో ప్రదర్శించారు. ఆయా రాష్ట్రాల సంస్కృతిని ప్రతింబింబించేలా ఉ‍న్న ఈ శకటాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రభల తీర్థం శకటాన్ని ప్రదర్శించారు. సంక్రాంతి పండగను ప్రతిబింబించేలా ఈ శకటాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. అలాగే గుజరాత్‌, అసోం, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల శకటాలు చూపరులను ఆకట్టుకున్నాయి.

10:30 AM

పరేడ్‌లో రాష్ట్రపతి, ‍ప్రధాని..
ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వేడుకలకు ప్రత్యేక అతిథిగా వచ్చిన ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా గణతంత్ర పరేడ్‌లో పాల్గొన్నారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించారు. 21-గన్ సెల్యూట్‌తో జాతీయ గీతం ఆలపించారు. సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ గణతంత్ర పరేడ్‌లో ఈజిప్టు సైన్యం కూడా పాల్గొంది.

10:20 AM


పరేడ్‌కు రాష్ట్రపతి
ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫతాతో కలిసి రాష్ట్రపతి భవన్‌ నుంచి కర్తవ్యపథ్‌కు బయల్దేరారు ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము. అక్కడ ఘనంగా నిర్వహించే 74వ గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు.

10:10 AM


అమరులకు మోదీ నివాళులు..
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ యుద్ధ స్మారకం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు ప్రధాని నరేంద్ర మోదీ.  దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సైనికులను స్మరించుకున్నారు. అనతరం కర్తవ్య పథలో గణతంత్ర పరేడ్‌కు హాజరవుతారు.

న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీ ముస్తాబైంది. కర్తవ్యపథ్‌లో నిర్వహించే గణతంత్ర పరేడ్‌కు అధికారులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేశారు.  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ హాజరవుతున్నారు. ఉదయం 10:30 గంటల సమయంలో పరేడ్ ప్రారంభం కానుంది. మొదట జాతీయ స్మారకాన్ని సందర్శించి అమరవీరులకు నివాళులు అర్పించిన అనంతరం మోదీ పరేడ్‌లో పాల్గొననున్నారు. ఈసారి గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ ఎల్-సిసీ హాజరవుతున్నారు.  ఈజిప్టు సైన్యం కూడా కవాతులో పాల్గొంటుంది. 

ఈ సారి నిర్వహించే పరేడ్ ప్రత్యేకంగా ఉండనుంది. సైనిక శక్తిసామర్థ్యాలతో పాటు, భారతీయ భిన్న  సంస్కృతి, స్వదేశీ సామర్థ్యాలు, నారీ శక్తిని ప్రతిబింబించేలా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల శకటాలతో పాటు మంత్రిత్వ శాఖలకు చెందిన 6 శకటాలను ప్రదర్శించనున్నారు.  

వారం రోజుల పాటు జరుగుతున్న గణతంత్ర వేడుకలు జనవరి 23న నేతాజి సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ప్రారంభమయ్యాయి. జనవరి 24, 25 తేదీల్లో 'ఆది శౌర్య- పర్వ్ పరాక్రమ్‌ కా' ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో నిర్వహించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top