జేఎన్‌యూ విద్యార్థి నేతల విడుదల

Delhi HC Grants Bail To JNU Jamia Students In Delhi Riots Case - Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ అల్లర్ల కుట్ర కేసులో అరెస్టై గత సంవత్సర కాలంగా జైళ్లో ఉన్న జేఎన్‌యూ విద్యార్థులు నటాషా నర్వాల్, దేవాంగన కలీతా, జామియా మిలియా విద్యార్థి ఆసిఫ్‌ ఇక్బాల్‌ తాన్హా గురువారం బెయిల్‌పై తీహార్‌ జైలు నుంచి విడుదలయ్యారు. తక్షణమే వారిని విడుదల చేయాలని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వారిని విడుదల చేశారు. రెండు రోజుల క్రితమే హైకోర్టు వారిద్దరితో పాటు ఆసిఫ్‌ తాన్హాకు బెయిల్‌ మంజూరు చేసింది.

వారి పూచీకత్తులను పరిశీలించడంలో జాప్యం జరగడంతో వారిని విడుదల చేయడం ఆలస్యమైంది. ఈ ముగ్గురు విద్యార్థి నేతలను గత సంవత్సరం మేలో ‘చట్ట వ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం( యూఏపీఏ– ఉపా)’ కింద అరెస్ట్‌ చేశారు. వెరిఫికేషన్‌లో జాప్యం వారి విడుదలను నిరోధించడానికి సరైన కారణం కాదని గురువారం నాటి ఆదేశాల్లో హైకోర్టు మండిపడింది. బెయిల్‌ మంజూరు చేస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చిన తరువాత ముగ్గురు నిందితులు తమను విడుదల చేస్తూ ఆదేశాలివ్వాలని కోరుతూ విచారణ కోర్టును ఆశ్రయించారు.

అయితే, వారి పిటిషన్‌ను విచారణ కోర్టు గురువారానికి వాయిదా వేయడంతో వారు మళ్లీ హైకోర్టుకు వెళ్లారు. దాంతో హైకోర్టు వారిని తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. విచారణ కోర్టు తీరును తప్పుబడుతూ ఈ అంశాన్ని వెంటనే, వేగంగా చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 2020 ఫిబ్రవరిలో ఢిల్లీలో జరిగిన అల్లర్లకు కుట్ర చేశారన్న ఆరోపణలపై వారిని అరెస్ట్‌ చేశారు. ఆ అల్లర్లలో 53 మంది చనిపోగా, 200 మందికి పైగా గాయపడ్డారు.

ఆ ముగ్గురు విద్యార్థి నేతలకు మంగళవారం బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వ్యతిరేకతను అణచాలన్న అత్యుత్సాహంతో నిరసన తెలిపే హక్కుకు, ఉగ్ర చర్యలకు మధ్య ఉన్న రేఖను ప్రభుత్వం విస్మరించిందని హైకోర్టు నాడు పేర్కొంది. కాగా, ఆ విద్యార్థినేతలకు బెయిల్‌ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.

చదవండి: దేశద్రోహం కేసులో  ఆయేషాకు బెయిల్‌  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top