లిక్కర్‌ స్కామ్‌ ప్రకంపనలు.. అసలేంటీ కథ?

Delhi Excise policy: Kejriwal Govt Involved in Liquor Scam - Sakshi

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం ప్రకంపనలు తెలంగాణను కుదిపేస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఈ స్కాంతో సంబంధాలున్నాయన్న బీజేపీ ఎంపీ ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అసలు ఏంటీ ఢిల్లీ కొత్త మద్యం విధానం..? దీనివల్ల ఖజనాకు ఏం నష్టం జరిగింది..?  సీబీఐ ఆరోపణలేంటి..? 

దేశ రాజధానిలో మద్యం అమ్మే దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే 2021 జూన్‌లో లిక్కర్ షాపుల  ప్రైవేటీకరణకు కేజ్రీవాల్ సర్కార్‌ తెర తీసింది. మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి.. ఒక్కో జోన్‌లో 27 లిక్కర్ వెండ్స్ ఉండేలా నిబంధనలు రూపొందించింది. దీనిద్వారా ఖజానాకు రూ.9,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆప్ ప్రభుత్వం.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పంపిన నివేదికలో పేర్కొంది .

అప్పట్లో ఢిల్లీ ఎల్‌జీగా ఉన్న అనిల్ బైజల్‌.. నూతన ఎక్సైజ్ పాలసీని ఆమోదిస్తూనే రెండు నిబంధనలు పెట్టారు. ప్రస్తుతం ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వొచ్చు. అయితే దుకాణాలు లేనిచోట మాత్రం.. ఢిల్లీ డెవలప్‌మెంట్‌ అథారిటీ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి. అయితే డీడీఏ, ఎమ్‌సీడీల నుంచి పర్మిషన్‌ తప్పనిసరి నిబంధనను కేజ్రీవాల్ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఎమ్‌ఆర్‌పీలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ధరలు నిర్ణయించుకునేందుకు లైసెన్స్‌దారులకు అధికారం ఇవ్వడం, తెల్లవారుజామున 3 గంటల వరకూ షాపులు నడుపుకునేందుకు అనుమతితో పాటు డ్రై డేలను 21రోజుల నుంచి 3 రోజులకు తగ్గించడం వంటివి చేసింది. 

2021 నవంబర్‌లో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే దీంట్లో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం షాపుల కోసం టెండర్లు వేసినవారికి లైసెన్స్ ఫీజ్‌లో రాయితీలు ఇచ్చినట్టు, కొందరికి పూర్తిగా లైసెన్స్ ఫీజ్ మాఫీ చేసినట్టు తన నివేదికలో పేర్కొన్నారు చీఫ్ సెక్రటరీ. కొవిడ్ టైమ్‌లో మద్యం అమ్మకాలు లేకపోవడంతో రూ.144 కోట్ల ఫీజును మాఫీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతేకాదు, విదేశీ బీరు విచ్చలవిడిగా ప్రవేశించడానికి వీలుగా కంపెనీలకు ఒక్కో కేసుకు 50 చొప్పున రాయితీ కూడా ఇచ్చినట్టు సీఎస్‌ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. 

ఢిల్లీ విద్యాశాఖతోపాటు ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఆయనతోపాటు అప్పటి ఎక్సైజ్ కమిషనర్‌ ఆరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఏకే తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్‌లతోపాటు మరో 9 మంది వ్యాపారవేత్తలని నిందితులుగా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చింది. ఐపీసీ సెక్షన్ 120-బి, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. మద్యం విధానంలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు, రాజకీయనేతలకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు పేర్కొంది. సిసోడియాకు కుడిభుజమైన దినేశ్ అరోరా అనే వ్యక్తికి చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులు అందినట్టు సాక్ష్యాలతో బయటపెట్టింది సీబీఐ. అయితే కేజ్రీవాల్‌, సిసోడియా మాత్రం ఇవన్నీ అసత్యాలే అంటున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top