
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తాను యమునా నది ప్రక్షాళనతో పాటు రాజధానిలో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తరచూ చెబుతుంటారు. తాజాగా ఆమె నూతన అధికారిక నివాసం గురించి చర్చలు జరుగుతున్నాయి. రాజ్ నివాస్ మార్గ్‌లోని బంగ్లా నంబర్ వన్‌ను ఆమెకు అధికారికంగా కేటాయించగా, ఈ నెలలోనే ఆ భవన పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందుకు రూ. రూ.60 లక్షలకు పైగా మొత్తాన్ని వెచ్చిస్తున్నారని సమాచారం.
ఢిల్లీ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) జారీ చేసిన టెండర్ నోటీసులోని వివరాల ప్రకారం భవన పునరుద్ధరణలో ప్రధానంగా నూతన విద్యుత్ పరికరాలను అమర్చడంపై దృష్టి సారించనున్నారు. దీని టెండర్ కోసం బిడ్‌లు జూలై 4న ప్రారంభం కానున్నాయి. పునరుద్దరణ పనులు 60 రోజుల వ్యవధిలో పూర్తికానున్నాయని అధికారులు తెలిపారు. సీఎం రేఖా గుప్తాకు రెండు బంగ్లాలు కేటాయించగా, వాటిలో ఒక బంగ్లాను ఆమె నివాసానికి ఉపయోగించనున్నారు. మరొక బంగ్లాను క్యాంప్ ఆఫీస్‌గా ఉపయోగించనున్నారు.
జూన్ 28న జారీ చేసిన టెండర్‌లో రూ.60 లక్షల మొత్తంతో రూ.9.3 లక్షల విలువైన ఐదు టీవీలు ముఖ్యమంత్రి బంగ్లాలో ఏర్పాటు చేయనున్నారు. రూ.7.7 లక్షల విలువైన 14 ఏసీలు, రూ.5.74 లక్షల విలువైన 14 సీసీటీవీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ ఇంటికి రూ. రెండు లక్షలతో నిరంతర విద్యుత్ సరఫరా (యూపీఎస్) వ్యవస్థ కూడా ఏర్పాటు చేస్తున్నారు. రూ. 1.8 లక్షల ఖర్చుతో రిమోట్ కంట్రోల్‌తో నడిచే 23 సీలింగ్ ఫ్యాన్‌లను కూడా అమర్చనున్నారు. గత ఫిబ్రవరిలో ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇది కూడా చదవండి: ‘సిక్కిం పొరుగు దేశమా?’.. బీజేపీ చురకతో కాంగ్రెస్ నేత క్షమాణలు