లక్నో: బాగ్‌డోగ్రా(పశ్చిమ బెంగాల్) విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. గాలిలో ఉండగానే విమానంలో పొగలు రావడంతో పైలట్లు అత్యవసర ల్యాండింగ్ కోసం లక్నోకు విమానాన్ని మళ్లించారు. విమానం 36 వేల అడుగుల ఎత్తులో ఉండగా, ఒక్కసారిగా ఆక్సిజన్ మాస్కులు కిందకు రావడంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు ప్రాణభయంతో వణికిపోయారు.
అసలేం జరిగింది?
సోమవారం సాయంత్రం 134 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ఐఎక్స్ 1523 (IX 1523) విమానం ‘బాగ్‌డోగ్రా’ నుంచి బయలుదేరింది. సాయంత్రం 4:58 గంటల సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ జిల్లా మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, ఏవియానిక్ ప్యానెల్ నుంచి పొగ వస్తున్నట్లు పైలట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన వారు ‘పాన్ పాన్’ (PAN PAN) కాల్ ద్వారా అత్యవసర పరిస్థితిని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు చేరవేసి, లక్నోలో ల్యాండింగ్‌కు అనుమతి కోరారు.
విమానంలో గందరగోళం
అత్యవసర ల్యాండింగ్ ప్రకటన వెలువడగానే విమానంలో ఆక్సిజన్ మాస్కులు కిందకు పడ్డాయి. దీంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే, విమాన సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ప్రయాణికులను శాంతింపజేస్తూ, మాస్కులను ఎలా ఉపయోగించాలో సూచనలు ఇస్తూ, వారికి భరోసా కల్పించారు. సాయంత్రం 5:17 గంటలకు లక్నోలోని చౌదరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
తనిఖీల్లో తేలిందేంటి?
విమానం ల్యాండ్ అయిన వెంటనే ప్రయాణికులను టెర్మినల్-3కి తరలించారు. అగ్నిమాపక దళం, సాంకేతిక నిపుణులు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో ఎలాంటి పొగ లేదా మంటల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి స్పందిస్తూ.. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని మళ్లించినట్లు తెలిపారు. ప్రయాణికులను స్వల్ప విరామం తర్వాత ప్రత్యామ్నాయ విమానాల్లో ఢిల్లీకి పంపించినట్లు పేర్కొన్నారు. ఈ సాంకేతిక లోపంపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
ఇది కూడా చదవండి: కువైట్ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం


