కువైట్‌ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం | Kuwait Oil Tanker Hit at Dubai Port Oil Spill Feared | Sakshi
Sakshi News home page

కువైట్‌ ట్యాంకర్‌పై ఇరాన్ దాడి: సముద్రంలో అల్లకల్లోలం

Mar 31 2026 8:11 AM | Updated on Mar 31 2026 8:44 AM

Kuwait Oil Tanker Hit at Dubai Port Oil Spill Feared

దుబాయ్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు  పతాక స్థాయికి చేరాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ పోర్ట్‌లో కువైట్‌కు చెందిన భారీ చమురు ట్యాంకర్‌పై ఇరాన్ నేరుగా దాడికి తెగబడింది. ఈ మెరుపు దాడితో ట్యాంకర్‌లో భారీగా మంటలు చెలరేగగా, సముద్రంలో చమురు ఒలికిపోయే ప్రమాదం పొంచి ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అసలేం జరిగింది?
కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ‘అల్ సాల్మీ’ అనే భారీ క్రూడ్ ఆయిల్ ట్యాంకర్ దుబాయ్ పోర్ట్‌లో ఉండగా ఇరాన్ దళాలు దాడి చేశాయి. కువైట్ అధికారిక వార్తా సంస్థ ‘కునా’ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ దాడి జరిగిన సమయంలో ట్యాంకర్ పూర్తిస్థాయి చమురు నిల్వలతో ఉంది. దాడి ప్రభావంతో నౌక తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, అందులో మంటలు చెలరేగాయి.

వణికిస్తున్న చమురు గండం
ట్యాంకర్‌ట్రాకర్స్.కామ్ (TankerTrackers.com) గణాంకాల ప్రకారం.. అల్ సాల్మీ నౌకలో ప్రస్తుతం 12 లక్షల బ్యారెళ్ల సౌదీ క్రూడ్ ఆయిల్, మరో  ఎనిమిది లక్షల బ్యారెళ్ల కువైట్ క్రూడ్ ఆయిల్ ఉంది. అంటే మొత్తం 20 లక్షల బ్యారెళ్ల ముడి చమురు సముద్రంలో కలిసిపోయే ముప్పు ఏర్పడింది. ఒకవేళ చమురు లీక్ అయితే పర్యావరణానికి భారీ నష్టం వాటిల్లుతుందని కువైట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.

క్షేమంగా 24 మంది సిబ్బంది
ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. నౌకలో ఉన్న మొత్తం 24 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు దుబాయ్ అధికారులు ధృవీకరించారు. దుబాయ్ మీడియా ఆఫీస్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్స్ సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ప్రస్తుతం నౌకకు జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ, చమురు లీక్ కాకుండా చూడటమే లక్ష్యంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి: అస్సాం ‘వార్‌’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ!

Advertisement
 
Advertisement
Advertisement