అస్సాం ‘వార్‌’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ! | Assam Polls key Contests that Could Shape Outcome | Sakshi
Sakshi News home page

అస్సాం ‘వార్‌’: ఈ ఏడు సీట్లలో.. నరాలు తెగే ఉత్కంఠ!

Mar 31 2026 7:39 AM | Updated on Mar 31 2026 8:49 AM

Assam Polls key Contests that Could Shape Outcome

ఈశాన్య రాష్ట్రం అస్సాంలో ఏప్రిల్ 9న జరగనున్న 126 అసెంబ్లీ స్థానాల పోరుకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా 2.49 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును వెల్లడించబోతున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాలు మాత్రం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. హేమాహేమీలు తలపడుతున్న ఈ స్థానాలే అస్సాంలో తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని మార్చే ఆ కీలక నియోజకవర్గాలపై ప్రత్యేక విశ్లేషణ..

జోర్హాట్: దిగ్గజాల మధ్య హోరాహోరీ
ఎగువ అస్సాంలోని జోర్హాట్ ఇప్పుడు రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మక స్థానంగా నిలిచింది. ఇక్కడ బీజేపీ తరపున ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన హితంద్ర నాథ్ గోస్వామి.. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, ప్రస్తుత ఎంపీ గౌరవ్ గొగోయ్‌తో తలపడుతున్నారు. 2016 నుంచి ఇక్కడ బీజేపీదే హవా.. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్‌లో గౌరవ్ గొగోయ్‌కు 12,130 ఓట్ల ఆధిక్యం లభించింది. నియోజకవర్గ పునర్విభజన తర్వాత మహిళా ఓటర్ల ప్రాబల్యం ఈ పోరును ‘నువ్వా-నేనా’ అన్నట్లుగా మార్చేసింది.

శివసాగర్: ప్రాంతీయత వర్సెస్ జాతీయ శక్తి
చారిత్రక శివసాగర్ నియోజకవర్గంలో త్రిముఖ పోటీ నెలకొంది. రైజోర్ దళ్ అధినేత అఖిల్ గొగోయ్ 2021లో జైలు నుంచే పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఈసారి ఆయనను ఢీకొట్టేందుకు బీజేపీ నుంచి కుశాల్ దోవారీ, మిత్రపక్షం అసోం గణ పరిషత్ (ఏజీపీ) నుంచి ప్రదీప్ హజారికా బరిలో ఉన్నారు. ఎన్‌డీఏ మిత్రపక్షాల మధ్యే ఇక్కడ ‘ఫ్రెండ్లీ కాంటెస్ట్’ జరగడం అఖిల్ గొగోయ్‌కు కలిసి వస్తుందా లేక ఓట్లు చీలుతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

బిహ్‌పురియా: ఫిరాయింపుల సెగ
బిహ్‌పురియాలో రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా కాషాయ కండువా కప్పుకుని బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవడం చర్చనీయాంశం అయ్యింది. కాంగ్రెస్ నుంచి నారాయణ్ (రామ్) భుయాన్ రంగంలో ఉన్నారు. ఆయన స్థానిక నిరుద్యోగం, గ్రామీణ ఆర్థిక సమస్యలను అస్త్రాలుగా చేసుకుని ప్రచారం చేస్తున్నారు. బీజేపీలో అంతర్గత అసమ్మతి భూపేన్ బోరాకు సవాల్‌గా మారింది.

జలుక్బారీ: ముఖ్యమంత్రి కోట
ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తన శక్తిని మరోసారి నిరూపించుకోవడానికి జలుక్బారీ నుంచి ఆరోసారి బరిలోకి దిగుతున్నారు. 2021లో లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచిన హిమంతకు ఇక్కడ ఎదురులేదనిపిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బిదిషా నియోగ్ ఆయనను ఢీకొంటున్నారు. నియోజకవర్గ పునర్విభజన జరిగినప్పటికీ, పట్టణ ఓటర్లు హిమంత వైపే మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి.

దిస్పూర్: రాజధాని పోరులో ‘రెబల్’ సెగ
రాష్ట్ర రాజధాని దిస్పూర్ నియోజకవర్గంలో రాజకీయం మెగా డ్రామాను తలపిస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన ప్రద్యుత్ బోర్డోలోయ్ ఇక్కడి అభ్యర్థి. ఆయనపై కాంగ్రెస్ అభ్యర్థి మీరా బోర్తకూర్ గోస్వామి పోటీ చేస్తున్నారు. అయితే, టికెట్ దక్కని బీజేపీ సీనియర్ నేత జయంత కుమార్ దాస్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగడం బీజేపీకి తలనొప్పిగా మారింది. 2.43 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గం అస్సాం పట్టణ ఓటర్ల నాడిని ప్రతిబింబిస్తుంది.

గౌహతి సెంట్రల్: అనుభవం వర్సెస్ యువత
కొత్తగా ఏర్పడిన గౌహతి సెంట్రల్‌లో తరం మారుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. బీజేపీ సీనియర్ నేత విజయ్ కుమార్ గుప్తాతో 27 ఏళ్ల యువ నాయకురాలు, అస్సాం జాతీయ పరిషత్ (AJP) అభ్యర్థి కుంకీ చౌదరి తలపడుతున్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి వర్సెస్ యువత ఉపాధి అనే నినాదాల మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. ఆప్, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థులు కూడా ఉండటంతో ఓట్లు భారీగా చీలే అవకాశం ఉంది.

తముల్పూర్: మిత్రుల మధ్య యుద్ధం
బోడోలాండ్ రీజియన్‌లోని తముల్పూర్‌లో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఎన్‌డీఏ మిత్రపక్షాలైన బీజేపీ, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్‌) ఇక్కడ నేరుగా తలపడుతున్నాయి. బీజేపీ నుంచి బిస్వజిత్ దైమరీ, యూపీపీఎల్‌ అధినేత ప్రమోద్ బోరో పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతుతో రఫీ దైమరీ బరిలో ఉండటంతో, బోడో ఓట్ల చీలిక ఎవరికి లాభిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇది కూడా చదవండి: Assam: క్షుద్ర విద్యల రాజధానికి నేతల క్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement