
మైసూరు: మైసూరు మహానగర సౌందర్యం పండిత పామరులనే కాదు మూగజీవాలను కూడా ముగ్ధుల్ని చేస్తుందేమో. దసరా వేడుకలకు విచ్చేసిన గజరాజు అశ్వత్థామ అడవికి తిరిగి వెళ్లడానికి ససేమిరా అనడంతో అందరూ ఔరా అనుకున్నారు. దసరా కోసం వచ్చిన ఏనుగులను ఆదివారం ప్యాలెస్ నుంచి ఆయా అటవీ శిబిరాలకు తరలించారు. అశ్వత్థామ అనే ఏనుగు తాను లారీలోకి ఎక్కనని, మొండికేసింది. మావటీలు ఎంత యత్నించినా లారీలోకి ఎక్కలేదు. దీంతో వారు ప్రధాన గజరాజు అభిమన్యును ఆశ్రయించారు. అశ్వత్థామను అభిమన్యు ఒక్క తోపు తోయడంతో లారీకి ఎక్కడంతో అందరూ హమ్మయ్య అనుకున్నారు.
గజరాజులకు వీడ్కోలు
దసరా ఉత్సవాలు ఘనంగా ముగియడంతో గజరాజులు తిరిగి అడవి బాట పట్టాయి. ఆదివారం ఉదయం ప్యాలెస్‌లో గజరాజులకు సంప్రదాయ పూజలు చేసి వీడ్కోలు పలికారు. అంతకు ముందు మావటీలు, కాపలాదారులు ఏనుగులకు స్నానాలు చేయించి ఆహారం అందించారు. అనంతరం కెపె్టన్ అభిమన్యు నేతృత్వంలోని ఏనుగులను ప్రత్యేక లారీలలో అటవీ శిబిరాలకు తరలించారు.