‘మత మార్పిడులపై నిఘా షురూ!’

UP Cops Focused On Unlawful Religious Conversion Marriage - Sakshi

 చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధానికి కొత్త ఆర్డినెన్స్

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం లవ్‌ జిహాద్‌ పేరిట జరిగే బలవంతపు మత మార్పిడి వివాహాలను అడ్డుకోవడానికి ఆర్డినెన్స్ తెచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆర్డినెన్స్‌ తెచ్చిన వారానికి, ఓ హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి మధ్య జరుగనున్న వివాహ వేడుకను పోలీసులు నిలిపివేశారు. బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో వివాహ వేడుకలు ప్రారంభం కావడానికి ముందు, పోలీసులు అక్కడకి చేరుకుని ఇరు వర్గాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కి రావాలని కోరారు. వివాహానికి ముందు లక్నో జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి ఇరువర్గాలు అనుమతి పొందాలని వారికి సూచించారు. ఈ క్రమంలో.. పెళ్లి విషయంలో బలవంతం ఏదీ లేదని, ఇరు కుటుంబాల సమ్మతితోనే వివాహం జరుగుతుందని, మత మార్పిడి ఉద్దేశం లేదని ఇరు వర్గాలు పోలీసులకు తెలియజేశాయి. ఏదేమైనా చట్టపరంగా అన్ని ఫార్మాలిటీలను పూర్తి చేసిన తర్వాతనే వివాహం జరిపించనున్నట్లు వారు పేర్కొన్నారు.

కొత్త ఆర్డినెన్స్‌ ఏం చెబుతోంది?
ఇక వివాహం పేరుతో బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్ఠంగా పదేళ్ళ జైలు శిక్ష విధించవచ్చునని ఈ ఆర్డినెన్స్(2020) పేర్కొంది. పెళ్లి కోసం మతం మారాలంటూ బలవంతం చేసేవారికి ఒక ఏడాది నుంచి ఐదేళ్ళ వరకు జైలు శిక్ష, 15,000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్లను, ఎస్సీ, ఎస్టీ మహిళలను బలవంతంగా మతం మార్చేవారికి 3 సంవత్సరాల నుంచి పదేళ్ళ వరకు జైలు శిక్ష, 25,000 రూపాయల జరిమానా విధించవచ్చని ఆర్డినెన్స్‌ తెలిపింది. సామూహిక మతమార్పిడులకు పాల్పడితే 3 నుంచి 10 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 50000 రూపాయల జరిమానా విధించవచ్చు. (చదవండి: విడాకులు కోరిన ఐఏఎస్‌ దంపతులు)

జిల్లా మేజిస్ట్రేట్‌ అనుమతి తీసుకోవాలి: పోలీస్‌ అధికారి సురేష్‌ చంద్ర రావత్‌
‘‘వేర్వేరు మతాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి వివాహం చేసుకోనున్నట్లు డసెంబర్‌ 2న సమాచారం అందింది. మేము అక్కడికి చేరుకుని, ఇరు వర్గాలను స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు రావాలని సూచించాం. ఇరు కుటుంబాలకు కొత్తగా తెచ్చిన బలవంతపు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్ కాపీని అందించి, చట్ట ప్రకారం జిల్లా మేజిస్ట్రేట్‌తో లిఖితపూర్వకంగా అనుమతి తీసుకోవాలని సూచించాం. ఒకవేళ వివాహం తరువాత మతం మారే ఉద్దేశం ఉంటే కనీసం రెండు నెలల ముందుగానే జిల్లా మేజిస్ట్రేట్‌ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.’’ అని లక్నో సీనియర్‌ పోలీస్‌ అధికారి సురేశ్‌ చంద్ర రావత్‌ మీడియాకు తెలిపారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top