ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్షాల ఆందోళన

Congress raises cancellation of Question Hour In Parliament - Sakshi

వర్షాకాల సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు రద్దు

ప్రశ్నలు అడగటం మా ప్రాథమిక హక్కు: ఒవైసీ 

కొనసాగుతున్న పార్లమెం‍ట్‌ సమావేశాలు

సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్‌ నేపథ్యంలో ప్రశ్నోత్తరాలను రద్దు చేయడం పట్ల ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో పాటుదాని మిత్రపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బ్రిటీష్ హయాం నుంచీ ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయని, సామాన్యుల సమస్యలు లేవనెత్తేందుకు ప్రశ్నోత్తరాలు కీలకమని కాంగ్రెస్‌ లోక్‌సభపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి పేర్కొన్నారు. ప్రశ్నోత్తరాలు తొలగించి కొత్త సంప్రదాయానికి తెరలేపారని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రశ్నోత్తరాలు చేపట్టాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశాయి. సభలో ఎన్నికైన సభ్యులు ప్రశ్నించడం ‍ప్రాథమిక హక్కని హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టం చేశారు. విపక్షాలు నిరసనల నేపథ్యంలో స్పీకర్‌ ఓం బిర్లా కల్పించుకుని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కరోనా నుంచి మన దేశం త్వరగా కోలుకోవాలని అభిప్రాయపడ్డారు. (ఎంపీలు రెడ్డప్ప, మాధవిలకు పాజిటివ్‌)

చరిత్రలో తొలిసారి ఈ విధంగా సమావేశాలు జరుగుతున్నాయని, అసాధారణ పరిస్థితుల్లో జరిగే సమావేశాలకు సహకరించాలని స్పీకర్‌ సభ్యులను కోరారు. మధ్యలో పార్లమెంట్‌ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ కల్పించుకుని సభ్యులకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రశ్నలు లేవనెత్తేందుకు వివిధ రకాల విధానాలు ఉన్నాయన్నారు. సభ్యులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రశ్నోత్తరాల రద్దుపై విపక్ష సభ్యులతోనూ ముందే చర్చించామని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ గుర్తుచేశారు. సభ్యుల ప్రశ్నలకు తప్పకుండా సమాధానం చెబుతామన్నారు. సభ సజావుగా సాగేందుకు అందరి సహకారం అవసరమని రాజ్‌నాథ్‌ విజ్ఞప్తి చేశారు. (పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభం).

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top