ముగిసిన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌.. 96% ఓటింగ్‌ నమోదు

Congress Presidential Election 2022 Polls Live Updates - Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. దేశ వ్యాప్తంగా 96 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఢిల్లీ ఏఐసీసీ ఆఫీస్‌లోని పోలింగ్‌ బూత్‌లో 100 శాతం ఓటింగ్‌ నమోదు కాగా.. చండీగఢ్‌లోనూ 100 శాతం ఓటింగ్‌ నమోదైంది. ఈ నెల 19న ఢిల్లీలోని ఏఐఐసి కార్యాలయంలో ఓట్ల లెక్కింపు జరగనుంది. అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నారు. 

సాక్షి, హైదరాబాద్‌: గాంధీభవన్‌లో ఎఐసీసీ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. 238 ఓట్లకు గాను  228 మంది పీసీసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, చల్లా వెంకట్రామిరెడ్డి ఓటు వేయలేదు. ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ రెడ్డి, వంశీ చంద్ రెడ్డి ఢిల్లీలో ఓటు వేశారు. హర్కర వేణుగోపాల్‌ ల్లక్షద్వీప్‌లో ఓటేయగా.. ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు బెంగళూరులో ఓటేశారు.

137 ఏళ్ల కాంగ్రెస్‌ చరిత్రలో.. స్వాతంత్ర అనంతరం ఆరవసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయి. పైగా ఈ 22 ఏళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతుండడం ప్రత్యేకతను సంతరించుకుంది. గాంధీయేతర కుటుంబం నుంచి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరు కాబోతున్నారనే దానిపై ఉత్కంఠ నెలకొంది పార్టీ శ్రేణుల్లో.  అధ్యక్ష ఎన్నికల బరిలో సీనియర్లు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్‌లు నిలిచిన సంగతి తెలిసిందే. 

► కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 వేల మంది పీసీసీ డెలిగేట్స్‌ ఓటింగ్‌ ప్రక్రియలో పాల్గొంటున్నారు. మరో గంటలో ఓటింగ్‌ ముగియనుంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే కర్ణాటకలో ఓటేశారు. 

► బహిరంగంగా, ప్రజాస్వామయుతంగా, పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించడం ద్వారా కాంగ్రెస్ దేశానికే ఆదర్శంగా నిలిచిందని కాంగ్రెస్‌ నేత సచిన్ పైలట్ పేర్కొన్నారు.  ఈ ఎన్నికల్లో ఎవరు గెలిచినా పార్టీ సభ్యులందరి నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

► శశిథరూర్‌తో తనకు ఎలాంటి శత్రుత్వం లేదని మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. అధ్యక్ష ఎన్నిక పోలింగ్‌ సమయంలో తన ప్రత్యర్ధి శశి థరూర్‌ గురించి మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ‘ మేం మిత్రులం. శత్రువులు కాదు. రాజ్యాంగం ప్రకారం ఐక్య సభలో పోరాడుతున్నాం.. మాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను థరూర్‌తో ఫోన్‌లో మాట్లాడను’ అని తెలిపారు.

► కాంగ్రెస్‌ నేత అధీర్‌ రంజన్‌ చౌదరి కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌ నానా పటోల్‌ మహారాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయం తిలక్‌ భవన్‌లో ఓటేశారు. 

ఓటేసిన రాహుల్‌

కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ.. ఆ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కర్ణాటకలో భారత్‌ జోడో యాత్రలో ఉన్న ఆయన.. బళ్లారిలో క్యాంప్‌సైట్‌లోనే ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఓటు వేశారు.

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పూర్‌ ఏఐసీసీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న ముఖ్యమంత్రి భూపేష్‌ బాగెల్‌. 

► ఓటేసిన మాజీ ప్రధాని మన్మోహన్‌

దేశ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌.. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

► ఈ క్షణాల కోసమే ఎదురు చూస్తున్నా

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికపై తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్లిన ఆమె.. ‘నేను కూడా ఈ క్షణం కోసమే చాలాకాలంగా ఎదురు చూస్తున్నా’’ అంటూ సరదాగా వ్యాఖ్యానించారు. అంతకు ముందు ఆమె తన తనయ ప్రియాంక గాంధీ వాద్రాతో ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో పీసీసీ ప్రతినిధులు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేస్తున్నారు. కాంగ్రెస్ అధినేత్రి(తాత్కాలిక) సోనియాగాంధీ ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకుంటారని సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ వెల్లడించారు.

► ఢిల్లీ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ ఎంపీలు చిదంబరం, జైరామ్‌ రమేశ్‌, ఇతర నేతలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

► ఇద్దరు అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఫోన్‌లో ఒకరికొకరు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పుకున్నట్లు ప్రకటించారు.

 తన విజయంపై ధీమా వ్యక్తం చేశారు ఎంపీ శశిథరూర్‌. 

భారత్‌ జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు.. ఓటింగ్‌లో పాల్గొనడం  కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంగనకల్లు దగ్గర మీటింగ్‌ రూంలనే పోలింగ్‌ బూత్‌లుగా మార్చేశారు. రాహుల్‌ గాంధీ సహా జోడో యాత్రలో పాల్గొంటున్న వాళ్లు ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకుంటారు.

► ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలకు ఏర్పాట్లను సెంట్రల్‌ ఎలక్షన్‌ అథారిటీ చైర్మన్‌ మధుసుదన్‌ మిస్ట్రీ దగ్గరుండి పర్యవేక్షించారు.

బుధవారం(19 అక్టోబర్‌) కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. బ్యాలెట్ పేపర్లు అన్నీ కలిసిపోయి ఉంటాయి. కౌంటింగ్‌లో చెల్లని ఓట్లను పక్కన పెడతారు. ఎవరికైతే 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వస్తే వారు కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. కౌంటింగ్‌ అనంతరం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్‌ మధుసుదన్‌ అధికారికంగా విజేతను ప్రకటిస్తారు.
 

 కాంగ్రెస్‌లో సోనియా గాంధీ కుటుంబ జోక్యంపై గత కొంతకాలంగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో.. అధ్యక్ష ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తటస్థంగా ఉండాలని భావించింది. అందుకే ఇద్దరిలో ఎవరికీ బహిరంగంగా తమ మద్దతును ప్రకటించలేదు. అయితే.. 

 మల్లికార్జున ఖర్గేకు కొందరు పీసీసీ చీఫ్‌లు మద్దతు ప్రకటించడం, పార్టీ బేరర్‌ పదవుల్లో ఉన్న కొందరు ఓటేయాలని పిలుపు ఇవ్వడం పట్ల శశిథరూర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అధికార సంఘానికి కొందరి తీరుపై ఫిర్యాదు కూడా చేశారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం, సీనియర్ల అండ, దళిత మార్క్‌, పైగా అన్ని రాజకీయ పార్టీలతోనూ మంచి సంబంధాలు కలిగి ఉండడం.. మల్లికార్జున ఖర్గేకు కలిసొచ్చే అంశం.

కాంగ్రెస్‌ యువజన వర్గాల మద్దతుతో బరిలోకి దిగారు శశిథరూర్‌.

► సోమవారం ఉదయం పది గంటల ప్రాంతంలో మొదలైన కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌.. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా 65 పోలింగ్‌ బూత్‌లలో..  9వేల మందికిపైగా పీసీసీ ప్రతినిధులు.. ఎక్కడికక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top