Coal Crisis: పెను సంక్షోభం..? 

Coal Crisis In India - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో బొగ్గు కొరతతో విద్యుత్‌ సంక్షోభం ముంచుకొస్తోందని ఉత్తరప్రదేశ్‌ నుంచి కేరళ వరకు వివిధ రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. రాబోయే కొద్ది రోజుల్లోనే పలు రాష్ట్రాల్లో విద్యుత్‌ కోతలు విధించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఎదురవనుంది. రాజస్తాన్‌ ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో రోజుకి రెండు గంటలు, పల్లెల్లో రోజుకి నాలుగు గంటలు విద్యుత్‌ కోతలు విధిం చడం మొదలు పెట్టింది. కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నుంచి అందాల్సిన బొగ్గులో సగం కూడా రాజస్తాన్‌కి అందడం లేదు. పంజాబ్, జార్ఖండ్, మహా రాష్ట్రలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బొగ్గు మంత్రిత్వ శాఖ ఈ సమస్యని తగ్గించి చూపించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. డిస్కమ్‌లు యూనిట్‌కు రూ.20 పెట్టి మార్కెట్లో విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. కొద్దిరోజుల వ్యవధిలోనే నాలుగింతలు ధర పెరిగింది. 

దేశంలో 66% మేరకు విద్యుత్‌ వినియోగం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలపైనే ఆధారపడి ఉంది. సాధారణంగా ఈ కేంద్రాలలో 20 రోజుల వరకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంటాయి. కానీ ఇప్పుడు 70 వరకు కేంద్రాల్లో నాలుగు రోజులకి సరిపడా బొగ్గు మాత్రమే ఉంది.  దేశవ్యాప్తంగా ఉన్న 136 థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు 50% బొగ్గు సరఫరా కేంద్రానికి చెందిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ (సీఐఎల్‌) నుంచే జరుగుతుంది. కానీ నాలుగేళ్లుగా ఈ సంస్థ నుంచి బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతూ వస్తోంది. 2016 నుంచి స్వదేశీ బొగ్గుపైనే ఆధారపడాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పటికీ సీఐఎల్‌లో బొగ్గు ఉత్పత్తి ఆశించిన దాని కంటే 70 లక్షల నుంచి కోటి టన్నుల మేరకు పడిపోతూ వస్తోంది.

కొన్ని బొగ్గు గనుల్ని వేలం వేసి ప్రైవేటు విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు కేంద్రం అప్పగిం చింది. వీటి ద్వారా 12–14 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరగాల్సి ఉంది. కానీ ప్రైవేటు సంస్థలు కూడా బొగ్గు వెలికితీయడంపై దృష్టి పెట్టకుండా అంతర్జాతీయంగా బొగ్గు ధరలు తక్కువగా ఉన్నప్పుడు దిగుమతులపై ఆధారపడ్డాయి. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు ఈ ఏడాది మొదట్లో టన్ను 75 డాలర్లు ఉంటే ఇప్పుడు ఏకంగా 270 డాలర్లకు చేరుకుంది. దీంతో బొగ్గును కొనలేక, ఇప్పటికిప్పుడు ఉత్పత్తి పెంచలేక చేతులెత్తేస్తున్నాయి.  

ఇదో సంధికాలం  
బొగ్గు వంటి సంప్రదాయ ఇంధన వనరులతో వాతావరణం కలుషితమై గ్లోబల్‌ వార్మింగ్‌ పరిస్థితులకు దారి తీస్తూ ఉండడంతో చాలా దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై ఆధారపడుతున్నాయి. భారత్‌ కూడా అదే బాటలో నడుస్తూ గ్రీన్‌ ఎనర్జీ పేరుతో ప్రత్యామ్నాయ ఇంధన వినియోగానికి ప్రోత్సహిస్తోంది. ఇన్సెంటివ్‌లు ప్రకటిస్తోంది. దీంతో బొగ్గు గనుల అవసరాలకు అనుగుణంగా నిధుల్ని కేటాయించడం లేదు. అలాగని ప్రత్యామ్నాయ విధానాల ద్వారా విద్యుత్‌ డిమాండ్‌కి తగినంత ఉత్పత్తి జరగడం లేదు. ఫలితంగా సంక్షోభం ముంచుకొస్తోంది.  

కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు విద్యుత్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. లెబనాన్‌లో గత వీకెండ్‌లో 24 గంటల పాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చైనాలో కూడా విద్యుత్‌కి కొరత ఏర్పడడంతో కొత్తగా 90 బొగ్గు గనుల్లో తవ్వకాలు ప్రారంభించింది. యూరప్‌లో అధికంగా గ్యాస్‌ ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలే ఉన్నాయి. అయితే చమురు ధరలు ఆకాశాన్నంటడంతో యూకేలో కూడా 15 లక్షల ఇళ్లకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశాలున్నాయని బ్రిటన్‌ మీడియా చెబుతోంది. ఇక యూరప్‌లో చమురు ధరలు ఏకంగా 400 శాతం పెరగడంతో త్వరలోనే అక్కడ కూడా చార్జీలు పెరగనున్నాయి.     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

వాతలు తప్పవా ?  
విద్యుత్‌ కోతలతో పాటు చార్జీలు పెరిగి ప్రజలకు వాతలు కూడా తప్పేలా లేదు. కొద్ది రోజుల క్రితం వరకు ఒక యూనిట్‌ విద్యుత్‌ని 5 రూపాయలు ఉంటే, ఇప్పుడు డిస్కమ్‌ కంపెనీలు 20 రూపాయలు చెల్లించి కొనే పరిస్థితి వచ్చేసింది. గత జనవరి నుంచి బొగ్గు ధరలు అమాంతంగా 300 శాతం వరకు పెరిగాయి. ఈ పరిస్థితి కేవలం భారత్‌లోనే కాదు. కరోనా సెకండ్‌ వేవ్‌ తర్వాత ప్రపంచ దేశాల్లో ఆర్థిక పరిస్థితి కునారిల్లిపోయింది. దీంతో గ్యాస్‌ ఆధారితంగా పనిచేసే విద్యుత్‌  కేంద్రాల్లో ఉత్పత్తి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిపోయింది. ఫలితంగా విద్యుత్‌ చార్జీల మోత ఖాయమన్న ఆందోళనలు అంతటా వ్యక్తం అవుతున్నాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top