ఓటర్ల జాబితా సవరణపై దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న జంతర్‌మంతర్ వద్ద భారీ నిరసనకు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అయితే ఇప్పటికే విపక్షాల ధర్నాతో ఈ నిరసనకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించడంతో వివాదం మరింత ముదిరింది.
నిరసనకు ముందు తమ నేతలను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సీజేపీ నేత అభిజిత్ దీప్కే ఆరోపించారు. “ఎంతమందిని అరెస్టు చేస్తారు? అక్టోబర్ 10న దేశమంతా ఢిల్లీకి వస్తుంది” అంటూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అరెస్టులు, కేసులతో ఉద్యమాన్ని అణచలేరని వ్యాఖ్యానించారు.
మరో పోస్టులో.. అరెస్టులతో అసమ్మతి స్వరాలను అణచివేయొచ్చని మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఎంతమందిని నిర్బంధిస్తే అంతమంది నిరసనకు వస్తారు. అధికారమంతా మీ చేతుల్లో ఉండొచ్చు.. కానీ వీధులు ప్రజలవే” అంటూ దీప్కే ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Mass detentions being done before the October 10 protest. Modi thinks he can silence dissent by putting people behind bars. The more people you detain, the more people will show up!
— Abhijeet Dipke (@abhijeet_dipke) October 8, 2026
పోలీసుల అనుమతి ఎవరిక్కావాలి
మరోవైపు సీజేపీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ ఢిల్లీ పోలీసుల తీరుపై ప్రశ్నలు లేవనెత్తారు. నిరసనకు ‘పర్మిషన్’ అడగలేదని, పోలీసులకు కేవలం అధికారిక సమాచారం మాత్రమే ఇచ్చామని చెప్పారు. “ప్రజలు నిరసనకు రావాలా.. వద్దా అని పోలీసులు చెప్పడం ఏంటి?” అంటూ ప్రశ్నించారు. అక్టోబర్ 10న జంతర్‌మంతర్‌కు చేరుకుంటామని స్పష్టం చేశారు. సౌరవ్ దాస్ మరో పోస్టులో.. శాంతియుతంగా నిరసన చేపట్టడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని పేర్కొన్నారు. “మాకు జంతర్‌మంతర్ ఇవ్వండి.. లేదంటే మొత్తం ఢిల్లీని జంతర్‌మంతర్‌గా మార్చే పరిస్థితి వస్తుంది” అని హెచ్చరించారు.
విపక్షాల ఆందోళన.. ఈసీపై ఆరోపణలు
ఓటర్ల జాబితా సవరణ పేరుతో పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు తొలగిస్తున్నారని ప్రతిపక్షాలు, పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ ప్రక్రియతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని విమర్శిస్తున్నాయి. ముఖ్య ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఎన్నికల సంఘం మాత్రం ఓటర్ల జాబితాలను శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగానే SIR చేపట్టామని చెబుతోంది. నకిలీ, డూప్లికేట్, మరణించిన వారి పేర్లు, అర్హత లేని నమోదులను తొలగించడమే లక్ష్యమని స్పష్టం చేస్తోంది. ఇక విపక్షాల ఆందోళనపై స్పందించిన సీజేపీ.. తాము చేపట్టబోయే ఉద్యమం కూడా అలాంటిదేనని స్పష్టం చేసింది.
ఢిల్లీకి భారీ భద్రత
అక్టోబర్ 10 నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను భారీగా పెంచారు. అక్టోబర్ 8 నుంచి 12 వరకు కేంద్ర సాయుధ బలగాలకు చెందిన 221 కంపెనీలు.. అంటే దాదాపు 23 వేల మంది సిబ్బందిని ఢిల్లీలో మోహరించనున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్య ప్రాంతాల్లో పోలీసు బలగాలను కూడా అప్రమత్తం చేశారు. ఇప్పటికే ఢిల్లీలో జరిగిన SIR వ్యతిరేక నిరసనల్లో రాహుల్ గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్టోబర్ 10 నిరసనపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.
ఒకవైపు నిరసన.. మరోవైపు భారీ కౌంటర్
సీజేపీ, విద్యార్థి సంఘాలు భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. మరోవైపు బీజేపీ విద్యార్థి విభాగం, హిందూత్వ సంస్థలు కూడా కౌంటర్ నిరసనలకు సిద్ధమవుతున్నాయన్న ప్రచారం ఢిల్లీలో ఉద్రిక్తతను పెంచుతోంది. దీంతో నిరసనకారులు, ప్రత్యర్థి వర్గాలు ఎదురెదురుగా వస్తే పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అక్టోబర్ 10న ఢిల్లీలో ఏం జరుగుతుందన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: యూనిఫాం చించేసి.. మెడపై కొరికి..: జంతర్ మంతర్ దారుణం


