తెరుచుకోనున్న థియేటర్లు, జిమ్‌లు!

Cinema halls gyms likely to open Schools metros to remain shut in Unlock 3 - Sakshi

అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాలపై కేంద్ర హోంశాఖ కసరత్తు

ఇక థియేటర్లు, జిమ్‌లను అనుమతించే చాన్స్‌

25 శాతం సీటింగ్‌ సామర్థ్యంతో సినిమాహాళ్లు

పాఠశాలలు, మెట్రో రైళ్లకు ప్రస్తుతానికి అనుమతి లేనట్లే

న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా కోవిడ్‌–19 ఆంక్షల్ని మరింత సడలించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వతేదీతో అన్‌లాక్‌ 2.0 ప్రక్రియ ముగియనున్నందున అన్‌లాక్‌ 3.0 మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమైంది. సినిమా హాళ్లు, జిమ్‌లు తెరిచేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. 50% సీటింగ్‌ సామర్థ్యం, శానిటైజేషన్‌కి వీలుగా రెండు షోల మధ్య సుదీర్ఘ విరామం లాంటి జాగ్రత్తలతో థియేటర్లను ప్రారంభించడానికి యజమానులు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల మధ్య భౌతిక దూరం పాటించడం, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తొలుత 25% సీటింగ్‌తో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ హోంశాఖకు సూచించింది. (క్రికెట్ మ్యాచ్కు ప్రేక్షకులు షురూ)

ఏసీ థియేటర్లలో తలుపులన్నీ మూసి ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఏ ఒక్కరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల్ని అంచనా వేసి అక్కడ ప్రభుత్వాలే థియేటర్లు, జిమ్‌లు తెరవడానికి అనుమతినిచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు భావిస్తున్నారు. అన్‌లాక్‌ 3.0 సడలింపులను ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చేలా కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తోంది. (కరోనా కథలు)
 
క్యూలు నివారిస్తే.. 
► సినిమా హాళ్లు, జిమ్‌లను 25 శాతం సీటింగ్‌ కెపాసిటితో అనుమతించడంపై కేంద్ర సమాచార ప్రసారశాఖ హోంశాఖకు ప్రతిపాదనలు అందచేసింది. థియేటర్ల యజమానులతో చర్చించి కేంద్ర సమాచారశాఖ వీటిని రూపొందించింది. థియేటర్లలో విశ్రాంతి సమయంలో ఫలహారశాలల మధ్య క్యూలను నివారించడం ద్వారా చిత్ర ప్రదర్శనను ఆహ్లాదకరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు. 
 
మాస్కులతో వ్యాయామాలా? 
► సుదీర్ఘ విరామం తరువాత జిమ్‌లు తెరించేందుకు అనుమతించాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన సురక్షిత చర్యలపై సందిగ్ధం నెలకొంది. మాస్కులు ధరించి ఎక్సర్‌సైజులు చేయడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.  
 
స్కూళ్లు, మెట్రోలు లేనట్లే.. ! 
అన్‌లాక్‌ 3.0లో పాఠశాలలు, మెట్రో రైళ్లను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుతం వాటిని నడిపే ఆలోచన చేయడం లేదు. ఇక పాఠశాలలకు సంబంధించి యాజమాన్యాలు, తల్లిదండ్రులతో కేంద్ర మానవ వనరుల శాఖ పలు దఫాలు సంప్రదింపులు జరిపింది. తల్లిదండ్రులెవరూ ఇప్పట్లో స్కూళ్లు తెరవడానికి సుముఖంగా లేరని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించే అవకాశం లేదని భావిస్తున్నారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top