
పట్నా: బీహారీ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివరిలో జరగనున్నాయి. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలన్నీ తమ సన్నాహాల్లో మునిగితేలుతూ, దూకుడుగా వ్యవహరిస్తున్నాయి. ఇంతలో బీహార్‌కు చెందిన కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్‌ను హత్య చేస్తామంటూ సోషల్ మీడియాలో బెదిరింపులు వచ్చాయని లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్)వెల్లడించింది.
రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చోటుచేసుకున్న ఈ పరిణామం సంచలనంగా మారింది. పోలీసులు రంగంలోకి దిగి ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. పార్టీ ప్రతినిధి రాజేష్ భట్ పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో చేసిన ఫిర్యాదు ప్రకారం ‘టైగర్ మెరాజ్ ఈడీసీ’ అనే యూజర్‌నేమ్‌తో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ బెదిరింపు వచ్చింది. ఎల్‌జేపీకి నాయకత్వం వహిస్తున్న పాశ్వాన్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన అనంతరం ఆయనకు ఈ బెదిరింపు వచ్చింది. పాశ్వాన్‌కు అంతకంతకూ పెరుగుతున్న ప్రజాదరణ నేపధ్యంలో ఈ హెచ్చరిక రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
‘ఈ హెచ్చరిక తీవ్రతను వెంటనే గ్రహించి, సత్వర చర్యలు చేపట్టాలని అభ్యర్థిస్తున్నాను. దయచేసి నిందితుడిని వెంటనే అరెస్టు చేసి, అతనికి కఠినమైన శిక్ష విధించండి’ అని భట్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి ఈ బెదిరింపు వచ్చిందని సైబర్ డీసీపీ నితీష్ చంద్ర ధారియా మీడియాకు తెలిపారు. పట్నా సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. చట్టపరమైన చర్యలు చేపట్టామని ధరియా పేర్కొన్నారు. బీహార్‌లోని హాజీపూర్‌కు చెందిన కేంద్ర ఆహార ప్రాసెసింగ్ మంత్రి, లోక్‌సభ ఎంపీ చిరాగ్ పాశ్వాన్.. ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తేదీని భారత ఎన్నికల సంఘం ఇంకా ప్రకటించలేదు.